Intel: ఇంటెల్‌లో మాస్ లేఆఫ్.. ఈసారి 24,000 మంది తొలగింపు

by S Gopi |

ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే కాకుండా కంపెనీ తన కీలక జర్మనీ, పోలండ్ లాంటి చోట్ల చేపట్టిన విస్తరణలను కూడా రద్దు చేసింది.

Intel: ఇంటెల్‌లో మాస్ లేఆఫ్.. ఈసారి 24,000 మంది తొలగింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం ఇంటెల్ భారీ మాస్ లేఆఫ్‌కు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 24,000 మంది ఉద్యోగులను తొలగించడానికి కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 22-25 శాతానికి సమానం కావడం గమనార్హం. దీనివల్ల 2024 చివరి నాటికి కంపెనీలో 99,500 మంది వరకు ఉద్యోగులు 75 వేలకు తగ్గనున్నారు. ప్రధానంగా ఈ తొలగింపులు కృత్రిమ మేధ(ఏఐ) వైపు దృష్టి సారించడంతో పాటు పెద్ద మొత్తం ఖర్చు తగ్గించే పునర్నిర్మాణంలో భాగంగా జరగనున్నట్టు కంపెనీ సీఈఓ లి-బూ టాన్ తెలిపారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే కాకుండా కంపెనీ తన కీలక జర్మనీ, పోలండ్ లాంటి చోట్ల చేపట్టిన విస్తరణలను కూడా రద్దు చేసింది. తగినంత డిమాండ్ లేకుండానే ఫ్యాక్టరీ సామర్థ్యం పెంచాలని కంపెనీ భావించిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజా లేఆఫ్ నిర్ణయం అంతర్జాతీయంగా ఉండనుంది. కాబట్టి భారత్‌లోని ఉద్యోగులపైనా ఈ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాకుండా కోస్టా రికా నుంచి అసెంబ్లీ, టెస్టింగ్ కార్యకలాపాలను వియత్నాం, మలేషియాలకు మారుస్తోంది. తద్వారా 2 వేల మందికి పైగా కోస్టా రికా ఉద్యోగులు ఇతర బాధ్యతలకు మారనున్నారు. అలాగే, ఒహియో సెమీకండక్టర్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా కంపెనీ ఆలస్యం చేస్తోంది. ఇటీవల 2025 రెండో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ ఆదాయం క్షీణించడం కూడా తాజా పరిణామాలకు కారణం కావొచ్చని తెలుస్తోంది. దీనివల్ల పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లేందుకు కారణమవుతోంది. కాగా, ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ లాంటి టెక్ కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఇంటెల్ కూడా చేరింది.

Next Story