Instamart: క్విక్ కామర్స్ వ్యాపారం కోసం 'ఇన్‌స్టామార్ట్' సొంత బ్రాండింగ్

by S Gopi |

ఫుడ్ డెలివరీ విభాగం స్విగ్గీని దాటి ఇన్‌స్టామార్ట్ వ్యాపారం అధిగమిస్తుందని భావిస్తున్నామని స్విగ్గీ గ్రూప్ సీఈఓ శ్రీహర్ష మజెటీ చెప్పారు.

Instamart: క్విక్ కామర్స్ వ్యాపారం కోసం ఇన్‌స్టామార్ట్ సొంత బ్రాండింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ తన మాతృసంస్థ స్విగ్గీ పేరును తొలగించింది. క్విక్ కామర్స్ విభాగంలో స్వతంత్ర బ్రాండింగ్ ద్వారా మార్కెట్లో నిలబడే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. గత కొంతకాలంగా క్విక్ కామర్స్ విభాగంలో పోటీ తీవ్రమైంది. ఇటీవల మరో ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన బ్రాండ్‌ను ఎటర్నల్‌గా మార్చిన సంగతి తెలిసిందే. బ్లింక్ఇట్ పేరుతో క్విక్ కామర్స్ విభాగాన్ని, జొమాటో పేరుతో ఫుడ్ డెలివరీ సేవలను విడిగా అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్విగ్గీ సైతం వివిధ వ్యాపారాలకు వేర్వేరుగా బ్రాండింగ్ ఉండటం వల్ల మార్కెట్లో పోటీని తట్టుకోవచ్చని కంపెనీ భావిస్తోంది. క్విక్ కామర్స్ రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఫుడ్ డెలివరీ విభాగం స్విగ్గీని దాటి ఇన్‌స్టామార్ట్ వ్యాపారం అధిగమిస్తుందని భావిస్తున్నాం. అందుకోసమే ఇన్‌స్టామార్ట్ వ్యాపారానికి ప్రత్యేక బ్రాండింగ్ అవసరమని స్విగ్గీ గ్రూప్ సీఈఓ శ్రీహర్ష మజెటీ చెప్పారు. మొదట్లో ఇన్‌స్టామార్ట్ సేవలను స్విగ్గీ యాప్‌లోనే అందించిన స్విగ్గీ, ఇప్పుడు ఇన్‌స్టామార్ట్ యాప్‌ను విడిగా తీసుకొచ్చింది. ఈ సందర్భంగానే ఇన్‌స్టామార్ట్ తన కొత్త లోగోను విడుదల చేసింది. పేరులో స్విగ్గీని తొలగించింది. అయితే స్విగ్గీ లోగో అయిన 'ఎస్ ' ఐకాన్‌ను అలాగే కొనసాగించింది. త్వరలో ఇన్‌స్టామార్ట్ ప్యాకింగ్, క్యాంపెయిన్‌లలో మార్పును తీసుకురానున్నట్టు పేర్కొంది.

Next Story