Infosys: ఉద్యోగులు ఓవర్‌టైమ్ చేయొద్దని ఇన్ఫోసిస్ మెయిల్

by S Gopi |

ముఖ్యంగా రిమోట్ పద్ధతిలో పనిచేస్తున్న వారు సాధారణ పని గంటలకు మాత్రమే పరిమితం కావాలని ఉద్యోగులను అడుగుతోంది.

Infosys: ఉద్యోగులు ఓవర్‌టైమ్ చేయొద్దని ఇన్ఫోసిస్ మెయిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలని సూచిస్తూ, ఓవర్‌టైమ్ పని చేయవద్దని, ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం తెలియజేసింది. ఈ విషయంలో కంపెనీ హెచ్ఆర్ విభాగం అంతర్గతంగా ఉద్యోగుల పని సమయాన్ని ట్రాక్ చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రిమోట్ పద్ధతిలో పనిచేస్తున్న వారు సాధారణ పని గంటలకు మాత్రమే పరిమితం కావాలని ఉద్యోగులను అడుగుతోంది. అంతకుమించి ఓవర్‌టైమ్ పనిలోనే ఉండొద్దని కొందరికి మెయిల్ ద్వారా సూచితోంది. షెడ్యూల్ ప్రకారమే పనిచేయాలని, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.

సాధారణంగా ఇన్ఫోసిస్‌లో పనిచేసే ఒక ఉద్యోగి వారంలో ఐదు రోజులకు గానూ సగటున రోజుకు 9.15 గంటలు పనిచేయాలి. దీని ఆధారంగా ఒక నెలలో సగటుకు మించి ఎక్కువ గంటలు పనిచేస్తున్న వారికి కంపెనీ మెయిల్ ద్వారా దీనిపై పునరాలోచించాలని కోరుతోంది. అందులోనూ రిమోట్ పద్ధతిలో చేస్తున్నవారు వర్క్-లైఫ్‌ని బ్యాలెన్స్ చేయాలని, పని చేసే సమయంలో కూడా బ్రేక్ తీసుకోవడం ముఖ్యమని ఉద్యోగులకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ కో-ఫౌండర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి. గతంలో ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దానిపై భిన్నాభిప్రాయాలు, విమర్శలు వచ్చినప్పటికీ, ఆయన లెక్కజేయలేదు. ఈ క్రమంలో తాజా కంపెనీ ఉద్యోగులు ఓవర్‌టైం చేయొద్దని, ఆరోగ్యంపై దృష్టి సారించాలని చెప్పడం గమనార్హం.

Next Story