IndiGo Founders: స్వయంగా ఎదిగిన వ్యాపారుల్లో తొలిసారి ఇండిగో ప్రమోటర్లకు చోటు

by S Gopi |

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ సీఈఓ దీపిందర్ గోయల్ అగ్రస్థానం సాధించారు.

IndiGo Founders:  స్వయంగా ఎదిగిన వ్యాపారుల్లో తొలిసారి ఇండిగో ప్రమోటర్లకు చోటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్లైన రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ స్వయంకృషితో ఎదిగిన అగ్రశ్రేణి 10 మంది పారిశ్రామికవేత్తల జాబితాలో తొలిసారిగా చోటు సంపాదించారు. సెప్టెంబర్ 25 నాటికి ఉన్న గణాంకాల ఆధారంగా బుధవారం విడుదలైన 'ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియా-2025' జాబితాలో ఇండిగో వ్యవస్థాపకులు మూడవ స్థానంలో ఉన్నారు. నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండిగో మార్కెట్ విలువ రూ. 2.2 లక్షల కోట్లకు చేర్చడంలో వారిద్దరి కృషిని ప్రతిబింబిస్తూ వారు ఈ జాబితాలో మూడో స్థానం సొంతం చేసుకున్నారు. ఇందులో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ సీఈఓ దీపిందర్ గోయల్ అగ్రస్థానం సాధించారు. ప్రస్తుతం ఎటర్నల్ విలువ రూ. 3.2 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాదిలోనే కంపెనీ విలువ 27 శాతం పెరిగింది. ఈ ఏడాది వ్యాపార విలువ 13 శాతం తగ్గి రూ. 3 లక్షల కోట్లకు చేరిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు చెందిన రాధాకిషన్ దమాని కంటే దీపిందర్ గోయల్ ముందున్నారు. అంతేకాకుండా దీపిందర్ గోయల్ మొదటిసారిగా ఈ జాబితాలో చోటు సంపాదించారు.

ఆయన తర్వాత రాధాక్రిష్ట దమానీ(డీమార్ట్-దాదాపు రూ. 3 లక్షల కోట్లు), రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్(ఇండిగో), అభయ్ సోయి(మ్యాక్స్ హెల్త్‌కేర్-రూ. 1.11 లక్షల కోట్లు), శ్రీహర్ష మాజేటీ, నందన్ రెడ్డి(స్విగ్గీ-రూ. 1.06 లక్షల కోట్లు), దీప్ కర్లా, రాజేష్)మేక్‌మై్‌ట్రిప్-రూ. 94,500 కోట్లు), యాశిష్‌ దహియా, అలోక్‌ బన్సల్‌ (పాలసీ బజార్‌-రూ. 80,300 కోట్లు), విజయ్‌ శేఖర్‌ శర్మ(పేటీఎం-రూ. 72,900 కోట్లు), ఫల్గుణి నాయర్‌, అద్వైత్‌ నాయర్‌(నైకా-రూ. 67,500 కోట్లు), పీయూష్‌ బన్సల్‌, అమిత్‌ చౌధరి, నేహా బన్సల్‌, సుమిత్‌ కపాహీ(లెన్స్‌కార్ట్-రూ. 67 వేల కోట్ల) టాప్-10లో ఉన్నారు. ఈ జాబితాలోని అన్ని కంపెనీల మొత్తం విలువ 2025లో రూ. 42 లక్షల కోట్లకు చేరింది. ఇది గతేడాది నమోదైన రూ. 36 లక్షల కోట్ల నుంచి 15 శాతం పెరిగిందని నివేదిక వెల్లడించింది.

Next Story