Ultra-Rich: అత్యంత సంపన్నుల జాబితాలో భారత్‌కు 6వ స్థానం

by S Gopi |

2021 నుంచి 2026 మధ్యకాలంలో దేశీయంగా అత్యంత సంపన్నుల సంఖ్య 63.4 శాతం పెరిగిందని, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి అని నివేదిక స్పష్టం చేసింది.

Ultra-Rich: అత్యంత సంపన్నుల జాబితాలో భారత్‌కు 6వ స్థానం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో సంపన్నుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆల్ట్రా హై నెట్‌వర్త్ వ్యక్తుల జాబితాలో భారత్ 6వ స్థానంలో నిలిచింది. నైట్‌ఫ్రాంక్ విడుదల చేసిన 'వెల్త్ రిపోర్ట్-2026' ప్రకారం, 2026 నాటికి దేశంలో 30 మిలియన్ డాలర్ల ఆస్తులు కలిగిన అత్యంత సంపన్నుల(ఆల్ట్రా రిచ్) సంఖ్య 19,877కి చేరింది. 2031 నాటికి ఇది 27 శాతం పెరిగి 25,217కి చేరుకోవచ్చని అంచనా. ఇదే సమయంలో బిలియనీర్ల సంఖ్య 207కి చేరడంతో, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారత్‌కు 3వ స్థానం దక్కింది. 2021 నుంచి 2026 మధ్యకాలంలో దేశీయంగా అత్యంత సంపన్నుల సంఖ్య 63.4 శాతం పెరిగిందని, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి అని నివేదిక స్పష్టం చేసింది. టెక్నాలజీ, ఆర్థిక సేవలు, పారిశ్రామిక, కేపిటల్ మార్కెట్ల వంటి రంగాలు ఈ స్థాయి సంపన్నుల పెరుగుదలకు కీలకంగా ఉన్నాయి. ఈ రంగాలు సంపద సృష్టికి కొత్త మార్గాలను సృష్టించాయి.

రోజుకు 89 మంది కొత్త సంపన్నులు

ప్రపంచవ్యాప్తంగా కూడా ఆల్ట్రా రిచ్ సంఖ్య 2021లో 5,51,435 నుంచి 2026 నాటికి 7,13,626కి చేరుకుంది. అంటే, గత ఐదేళ్లుగా ప్రపంచంలో సగటున ప్రతిరోజూ 89 మంది కొత్త సంపన్నులు ఆల్ట్రా రిచ్ జాబితాలో చేరారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీరేట్ల పెంపు ఆందోళనలు, ఆర్థిక అసమానతలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంపద సృష్టి చాలా వేగంగా కొనసాగుతోంది. భారత్‌లో సైతం బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య 51 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

6.3 శాతానికి హైదరాబాద్ వాటా

ఎక్కువమంది ఆల్ట్రా రిచ్ జాబితాలో ముంబై అగ్రస్థానంలో ఉంది. అయితే, మొత్తం సంపన్నుల్లో ముంబై వాటా 35.4 శాతానికి తగ్గింది. 2015లో ఇది 41.3 శాతంగా ఉంది. దీని తర్వాత ఢిల్లీ వాటా 20 శాతం నుంచి 22.8 శాతానికి, హైదరాబాద్ వాటా 5 శాతం నుంచి 6.3 శాతానికి, చెన్నై వాటా 1.3 శాతం నుంచి ఏకంగా 4.8 శాతానికి పెరిగింది.

Next Story