Family Businesses: రోజుకు రూ. 7,100 కోట్ల సంపాదిస్తున్న బిలియనీర్లు

by S Gopi |

అంబానీ కుటుంబం వరుసగా రెండో ఏటా అగ్రస్థానంలో నిలిచింది.

Family Businesses: రోజుకు రూ. 7,100 కోట్ల సంపాదిస్తున్న బిలియనీర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాదికి సంబంధించి హురున్ ఇండియా విడుదల చేసిన జాబితాలో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీ కుటుంబం వరుసగా రెండో ఏటా అగ్రస్థానంలో నిలిచింది. వీరి సంపద విలువ రూ. 28.2 లక్షల కోట్లు ఉంటే, ఈ మొత్తం దేశ జీడీపీలో పన్నెండవ వంతు. వీరి తర్వాత కుమార్ మంగళం బిర్లా కుటుంబ సంపద రూ. 1.1 లక్షల కోట్లు పెరగడంతో రూ. 6.5 లక్షల కోట్ల విలువతో రెండో స్థానానికి చేరింది. జిందాల్ కుటుంబం రూ. 5.7 లక్షల కోట్లతో మొదటి మూడు స్థానాల్లోకి అడుగుపెట్టింది. వీరి కుటుంబం ఏడాది కాలంలో రూ. 1 లక్ష కోట్ల లాభాలను చూశారు. దేశంలోని టాప్-3 కుటుంబ వ్యాపారాల విలువ రూ. 471 బిలియన్లు (రూ. 40.4 లక్షల కోట్లు), ఈ మొత్తం ఫిలిప్పీన్స్ జీడీపీకి సమానం కావడం గమనార్హం. రూ. 2.6 లక్షల కోట్ల విలువతో అనిల్ అగర్వాల్ కుటుంబం ఆరు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి ప్రవేశించారు. దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాలలో ఎనర్జీ, ఆర్థిక సేవలు, సాఫ్ట్‌వేర్ వంటి రంగాలు అధిక సంపదను సృష్టించే పరిశ్రమలుగా కొనసాగుతున్నాయి.

20 లక్షల మందికి ఉపాధి

దేశంలోని టాప్-300 వ్యాపార కుటుంబాలు రోజుకు సగటున రూ. 7,100 కోట్లు సంపాదిస్తున్నాయని హురున్ ఇండియా పేర్కొంది. వీరందరి సమిష్టి సంపద విలువ రూ. 134 లక్షల కోట్లు ఉంటుంది. ఈ మొత్తం టర్కీ, ఫిన్లాండ్ సంయుక్త జీడీపీ కంటే ఎక్కువ. ఈ కుటుంబాలు 20 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. అంతేకాకుండా దేశ కార్పొరేట్ పన్ను వసూళ్లకు ఈ బిలియనీర్ కుటుంబాలు గణనీయంగా దోహదపడుతున్నాయి. వీరు రూ. 1.8 లక్షల కోట్ల సహకారం అందిస్తున్నారు. ఇది భారత కార్పొరేట్ పన్ను వసూళ్లలో 15 శాతానికి సమానం. రికార్డు స్థాయిలో 161 కుటుంబాలు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నాయి. అత్యంత విలువైన అన్‌లిస్టెడ్ కంపెనీగా రూ. 85,800 కోట్లతో హల్దీరామ్స్ నిలిచింది.

జాబితాలోని టాప్‌-10 కుటుంబాలు

1. అంబానీ కుటుంబం (రిలయన్స్‌ ఇండస్ట్రీస్) - రూ.28.23 లక్షల కోట్లు

2. కుమార మంగళం బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్‌)- రూ.6.47 లక్షల కోట్లు

3. జిందాల్‌ కుటుంబం (జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌) - రూ.5.70 లక్షల కోట్లు

4. బజాజ్‌ కుటుంబం (బజాజ్‌ గ్రూప్‌)- రూ.5.64 లక్షల కోట్లు

5. మహీంద్రా కుటుంబం (మహీంద్రా అండ్‌ మహీంద్రా)- రూ.5.43 లక్షల కోట్లు

6. నాడార్‌ కుటుంబం (హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్)- రూ.4.68 లక్షల కోట్లు

7. మురుగప్ప కుటుంబం (చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌) - రూ.2.92 లక్షల కోట్లు

8. ప్రేమ్‌జీ కుటుంబం (విప్రో) - రూ.2.78 లక్షల కోట్లు

9. అనిల్‌ అగర్వాల్‌ (హిందుస్థాన్‌ జింక్‌)- రూ.2.55 లక్షల కోట్లు

10. దానీ, చోక్సీ, వకిల్‌ కుటుంబాలు (ఏషియన్‌ పెయింట్స్‌) - రూ.2.20 లక్షల కోట్లు

మొదటితరం కుటుంబాల్లో అదానీ టాప్

హురున్ ఇండియా మోస్ట్ వాల్యూయబుల్ ఫ్యామిలీ బిజినెస్స్ జాబితా ప్రకారం, దేశంలో అత్యంత విలువైన మొదటి తరం కుటుంబ వ్యాపారాల జాబితాలో రూ. 14 లక్షల కోట్లతో అదానీ అగ్రస్థానంలో ఉంది. అదానీ తర్వాత సైరస్ పూనావాలా కుటుంబం సీరం ఇన్‌స్టిట్యూట్ ద్వారా రూ. 2.3 లక్షల కోట్లతో రెండో స్థానంలో, దివిస్ లాబొరేటరీస్‌కు చెందిన మురళి కె. దివి కుటుంబం రూ. 1.8 లక్షల కోట్లతో మూడవ స్థానంలో ఉంది. ఈ జాబితాలోకి ప్రవేశించిన ఇతర సంస్థలలో నువాల్ కుటుంబం (రూ. 1.6 లక్షల కోట్లు, సోలార్ ఇండస్ట్రీస్), రెడ్డి కుటుంబం (రూ. 1 లక్ష కోట్లు, అపోలో హాస్పిటల్స్), గ్రంథి కుటుంబం (రూ. 98,300 కోట్లు, జీఎంఆర్) ఉన్నాయి.

Next Story