G20 Report: 62 శాతం పెరిగిన టాప్ 1 శాతం ధనవంతుల సంపద

by S Gopi |

దిగువన ఉన్న సగం మంది కేవలం 1 శాతం సంపదను మాత్రమే పొందగలిగారని ఈ నివేదిక తెలిపింది

G20 Report: 62 శాతం పెరిగిన టాప్ 1 శాతం ధనవంతుల సంపద
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో అత్యంత సంపన్నులైన మొదటి 1 శాతం మంది సంపద గడిచిన 23 ఏళ్ల కాలంలో 62 శాతం పెరిగిందని జీ20 నివేదిక పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా అసమానతలు తీవ్ర స్థాయిలకు చేరుకున్నాయని, ఈ పరిస్థితులు ప్రజాస్వామ్యం, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ అస్థిరతకు దారి తీయవచ్చని ఓ నివేదిక హెచ్చరించింది. ఆర్థికవేత్తలు జయతి ఘోష్, విన్నీ బ్యానిమా, ఇమ్రాన్ వలోడియాలతో కూడిన ప్రపంచ అసమానతపై స్వతంత్ర నిపుణుల జీ20 అసాధారణ కమిటీ.. 2000-2024 మధ్య మొత్తం ప్రపంచం సృష్టించిన సంపదలో ప్రపంచవ్యాప్తంగా టాప్ 1 శాతం మంది 41 శాతం సొంతం చేసుకోగా, దిగువన ఉన్న సగం మంది కేవలం 1 శాతం సంపదను మాత్రమే పొందగలిగారని ఈ నివేదిక తయారీకి నేతృత్వం వహించిన నోబెల్‌ గ్రహీత జోసఫ్‌ స్టిగ్లిట్జ్‌ చెప్పారు. ధనిక, పేద దేశాల మధ్య అంతరం తగ్గిందని నివేదిక పేర్కొంది. చైనా, భారత్ లాంటి దేశాల్లో ధనవంతుల సంఖ్య పెరగడం వల్ల ఇది జరిగింది. ఈ రెండు దేశాల్లో తలసరి ఆదాయం పెరిగింది. ఫలితంగా, ధనిక దేశాలు ఇప్పుడు ప్రపంచ మొత్తం ఆదాయంలో తక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరిగితే, తీవ్రస్థాయిలో అసమానతలను ఎదుర్కొనే దేశాలు ప్రజాస్వామ్యం బలహీనతను ఎదుర్కొనే అవకాశం ఉంది. 230 కోట్ల మందికి ఆహార భద్రత కరువైందని, వైద్య ఖర్చుల కారణంగా మరో 130 మంది దారిద్ర్యంలోకి చేరారని నివేదిక తెలిపింది. కొంతమంది చేతుల్లోనే సంపద ఉండిపోవడం వల్ల అస్థిరత పెరుగుతోందని అభిప్రాయపడింది. వీటి పరిష్కారానికి విధానపరమైన చర్యలు అవసరం నివేదిక పేర్కొంది. ప్రపంచ ధోరణులను పర్యవేక్షించడానికి, విధాన రూపకల్పనకు మార్గనిర్దేశం చేయడానికి ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తరహాలో అంతర్జాతీయ అసమానత ప్యానెల్ (ఐపీఐ) ఏర్పాటు చేయాలని నివేదిక ప్రతిపాదించింది.

Next Story