Brands: భారత్ టాప్-100 బ్రాండ్ల విలువ రూ. 24 లక్షల కోట్లు

by S Gopi |

దేశంలోని టాప్-100 బ్రాండ్‌ల మొత్తం విలువ రికార్డు స్థాయిలో 252.8 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 24 లక్షల కోట్లకు పైగా) చేరింది.

Brands: భారత్ టాప్-100 బ్రాండ్ల విలువ రూ. 24 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారతీయ బ్రాండ్‌లు మార్కెట్‌లో తమ సత్తా చాటుకున్నాయి. 'బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా 100, 2026' నివేదిక ప్రకారం, దేశంలోని టాప్-100 బ్రాండ్‌ల మొత్తం విలువ రికార్డు స్థాయిలో 252.8 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 24 లక్షల కోట్లకు పైగా) చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 7 శాతం వృద్ధి. టాప్-10 స్థానాల్లో ఉన్న బ్రాండ్‌లలో తొమ్మిదింటి విలువ మరింత పెరిగింది. కార్పొరేట్ దిగ్గజం 'టాటా గ్రూప్' తన బ్రాండ్ విలువను 7 శాతం పెంచుకుని, 33.6 బిలియన్ డాలర్ల(రూ. 3.23 లక్షల కోట్ల)తో వరుసగా 10వ ఏడాది కూడా దేశంలోనే మోస్ట్ వేల్యూబుల్ బ్రాండ్‌గా అగ్రస్థానాన్ని కాపాడుకుంది. ఆ తర్వాత ఐటి రంగంలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న 'ఇన్ఫోసిస్' సంస్థ 16.4 బిలియన్ డాలర్ల(రూ. 1.57 లక్షల కోట్ల) విలువతో వరుసగా ఐదో ఏడాది కూడా రెండో స్థానాన్ని పదిలపరుచుకుంది.

దూసుకుపోతున్న ఎల్‌ఐసి, రిలయన్స్

ఈ ఏడాది నివేదికలో అత్యంత ప్రతిభ కనబరిచిన బ్రాండ్‌గా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం 'ఎల్‌ఐసీ' నిలిచింది. దీని బ్రాండ్ విలువ 12 శాతం పెరిగి 15.3 బిలియన్ డాలర్ల(రూ. 1.43 లక్షల కోట్ల)కు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బలమైన నెట్‌వర్క్ పుణ్యమా అని.. బ్రాండ్ విలువ, బ్రాండ్ బలం (స్ట్రెంత్) రెండింటిలోనూ టాప్-5 స్థానాల్లో నిలిచిన ఏకైక బ్రాండ్‌గా ఎల్‌ఐసి రికార్డు సృష్టించింది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం 'హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్' విలువ స్వల్పంగా 2 శాతం తగ్గి 13.9 బిలియన్ డాలర్ల(రూ. 1.33 లక్షల కోట్ల)కు చేరినప్పటికీ ప్రైవేట్ ఫైనాన్స్ విభాగంలో లీడర్‌గానే కొనసాగుతోంది. ముకేశ్ అంబానీకి చెందిన 'రిలయన్స్ గ్రూప్' బ్రాండ్ విలువ 11 శాతం వృద్ధితో 10.8 బిలియన్ డాలర్ల(రూ. 1.03 లక్షల కోట్ల)ను తాకింది. అలాగే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ 'ఎస్‌బీఐ' తన విలువను 2 శాతం పెంచుకుని 9.8 బిలియన్ డాలర్ల(రూ. 94.2 వేల కోట్ల)కు చేరింది.

అదానీ కొత్త రికార్డు

ఈ ఏడాది టాప్-10 జాబితాలోకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చి 'అదానీ గ్రూప్' సంచలనం సృష్టించింది. పోర్టులు, విమానాశ్రయాలు, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాల రంగంలో దూసుకుపోతున్న ఈ గ్రూప్ ఏకంగా 31 శాతం వృద్ధిని నమోదు చేసి, 8.5 బిలియన్ డాలర్ల(రూ. 81.71 వేల కోట్ల) విలువతో అగ్రగామి బ్రాండ్‌ల సరసన చేరింది.

Next Story