Corporate India: దేశంలోని టాప్ 10 కంపెనీల విలువ కెనడా జీడీపీ కంటే ఎక్కువ

by S Gopi |

దేశంలోని అత్యంత విలువైన టాప్-10 కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 86 లక్షల కోట్లు (908 బిలియన్ డాలర్లు)గా ఉంది.

Corporate India: దేశంలోని టాప్ 10 కంపెనీల విలువ కెనడా జీడీపీ కంటే ఎక్కువ
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత ఏడాది కాలంలో దేశంలోని అత్యంత విలువైన 10 కార్పొరేట్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ. 11 లక్షల కోట్లు తగ్గినప్పటికీ, వాటి వ్యాపార సామ్రాజ్యం మాత్రం ప్రపంచ దేశాల కంటే శక్తివంతంగా నిలిచింది. తాజా 'బర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500' నివేదిక ప్రకారం.. దేశంలోని అత్యంత విలువైన టాప్-10 కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 86 లక్షల కోట్లు (908 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఏడాది క్రితం ఈ విలువ రూ. 97 లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ.. ఇది కెనడా ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) కంటే ఎక్కువగా ఉండటం విశేషం. అంతేకాదు, ఈ విలువ దేశ మొత్తం జీడీపీలో నాలుగవ వంతుకు (25 శాతం) సమానంగా ఉండటమే కాకుండా, దేశంలోని టాప్ 500 కంపెనీల మొత్తం సంపదలో 27 శాతం వాటాను కలిగి ఉంది. గత దశాబ్ద కాలంలో ఈ టాప్-10 సంస్థల విలువ 3.5 రెట్లు పెరగ్గా, అందులో ఏడు కంపెనీలు గత ఐదేళ్లుగా తమ టాప్ స్థానాలను పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నాయి.

రూ. 19.36 లక్షల కోట్లతో అగ్రస్థానంలో రిలయన్స్

దేశీయ కార్పొరేట్ రంగంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రూ. 19.36 లక్షల కోట్ల మార్కెట్ విలువతో తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాది కాలంలో మార్కెట్ ఒత్తిడిలో ఉన్నా కూడా రిలయన్స్ ఏకంగా రూ. 1.8 లక్షల కోట్లకు పైగా విలువను పెంచుకుంది. ఈ జాబితాలోని మరే కంపెనీ కూడా ఈ స్థాయిలో సంపదను సృష్టించలేదు. దేశంలోని టాప్-10 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఐదవ వంతు (దాదాపు 20 శాతం) వాటా ఒక్క రిలయన్స్ సంస్థదే కావడం కంపెనీ ఆధిపత్యానికి నిదర్శనం.

టెలికాం, ఫైనాన్స్ రంగాల వైపే మొగ్గు

ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో అత్యంత ఆసక్తికరంగా రూ. 11.5 లక్షల కోట్ల విలువతో భారతీ ఎయిర్‌టెల్ మూడో స్థానానికి చేరుకుంది. గత ఐదేళ్లలో కంపెనీ విలువ 198 శాతం పెరగడం, భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. మరోవైపు ఫైనాన్షియల్ రంగం కూడా జాబితాలో పట్టు సాధించింది. విలువలో 17 శాతం తగ్గినప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండో స్థానంలో నిలవగా, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 9 లక్షల కోట్లకు పైగా విలువతో నాలుగో స్థానానికి చేరింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ ఏకంగా 37 శాతం వృద్ధితో రూ. 5.83 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించి తొలిసారి టాప్-10 లోకి (6వ స్థానం) దూసుకొచ్చింది.

ఐటీ దిగ్గజాలకు కాలం కలిసిరాలేదు

గ్లోబల్ మార్కెట్లపై ఆధారపడే సంప్రదాయ ఐటీ సేవల పరిశ్రమ ఆధిపత్యం దేశీయ మార్కెట్లో క్రమంగా తగ్గుతున్నట్లు ర్యాంకింగ్‌లు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా టెక్నాలజీ ఖర్చులు మందగించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఐటీ కంపెనీల వృద్ధిపై పునఃసమీక్ష మొదలైంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ విలువ ఏడాది కాలంలో 44 శాతం, ఐదేళ్లలో 32 శాతం పడిపోయి ఐదో స్థానానికి చేరింది. మరో దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం ఐదేళ్లలో 36 శాతం క్షీణతతో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

Next Story