Crude Oil: మే నెలలో పెరిగిన రష్యా చమురు దిగుమతులు

by S Gopi |

ఇందులో 83 శాతం వాటా ముడి చమురుదే కాగా, దాని విలువ 4.8 బిలియన్ యూరోలు(రూ. 52.18 వేల కోట్ల).

Crude Oil: మే నెలలో పెరిగిన రష్యా చమురు దిగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రష్యా ఇంధన ఎగుమతులకు భారత్ మరోసారి కీలక మార్కెట్‌గా నిలిచింది. యూరోపియన్ థింక్ ట్యాంక్ సీఆర్ఈఏ తాజా నివేదిక ప్రకారం, మే నెలలో భారత్ సుమారు 5.8 బిలియన్ యూరోలు (దాదాపు 63.72 వేల కోట్లు) విలువైన రష్యా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంది. ఇందులో 83 శాతం వాటా ముడి చమురుదే కాగా, దాని విలువ 4.8 బిలియన్ యూరోలు(రూ. 52.18 వేల కోట్ల). చమురు ఉత్పత్తులు, బొగ్గు దిగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. మే నెలలో భారత్ మొత్తం ముడి చమురు దిగుమతులు 8 శాతం పెరగ్గా, రష్యా నుంచి వచ్చే చమురు కొనుగోళ్లు ఒక్క నెలలోనే 21 శాతం పెరగడం విశేషం. దీంతో రష్యా చమురు ఎగుమతుల్లో చైనా తర్వాత 36 శాతం వాటాతో భారత్ రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది.

భారత రిఫైనరీలు రాయితీ ధరలకు లభిస్తున్న రష్యా చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. గుజరాత్‌లోని వడినార్ రిఫైనరీలో రష్యా చమురు దిగుమతులు 36 శాతం పెరగ్గా, జామ్‌నగర్ రిఫైనింగ్ కాంప్లెక్స్‌లో 14 శాతం వృద్ధి నమోదైంది. ప్రభుత్వ రంగానికి చెందిన విశాఖపట్నం, న్యూ మంగళూరు రిఫైనరీలు కూడా రష్యా చమురు కొనుగోళ్లను మరింత పెంచాయి. ఒడిశాలోని పారాదీప్ రిఫైనరీ రెండేళ్లలోనే అత్యధిక పరిమాణంలో రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. పాశ్చాత్య ఆంక్షలు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు కొనసాగుతున్నప్పటికీ, తక్కువ ధరలకు చమురు లభించడం భారత రిఫైనరీలకు ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా మారింది. అదే సమయంలో ఈ చమురుతో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లకు ఎగుమతి కావడం కూడా గమనార్హం.

Next Story