India: అమెరికా సాఫ్ట్‌వేర్, క్లౌడ్ సేవలపై ఆధారపడటం వల్ల భారత్‌కు నష్టం

by S Gopi |

భారత్ తప్పనిసరిగా దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను, క్లౌడ్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని సూచించింది.

India: అమెరికా సాఫ్ట్‌వేర్, క్లౌడ్ సేవలపై ఆధారపడటం వల్ల భారత్‌కు నష్టం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో భారత్ అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్, క్లౌడ్ సేవలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడటం వలన ఆర్థిక, భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని థింక్ ట్యాంక్ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చి ఇనిషియేటివ్‌(జీటీఆర్ఐ) ఆదివారం తెలిపింది. భారత్ తప్పనిసరిగా దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను, క్లౌడ్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. సొంతంగానే సైబర్ సెక్యూరిటీ, డేటా ఆధారిత ఏఐ లాంటి టెక్ విషయాల్లో స్వయంసమృద్ధి సాధించడం ద్వారా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. అమెరికా సాఫ్ట్‌వేర్‌లు, క్లౌడ్ టెక్నాలజీ, ఇతర సోషల్ మీడియాలపై ఎక్కువగా ఆధారపడటం మూలంగానే ఇప్పుడు భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్న సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్నామని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఏఐ వంటి టెక్నాలజీ అయినా మరేదైనా అతిగా ఆధారపడటం మూలంగా అనుకోని సందర్భాల్లో టెక్నాలజీ సేవలు, డేటా ఆగిపోయే ముప్పు ఉంటుందనే విషయం గుర్తించుకోవాలని హెచ్చరించింది. అమెరికా సేవలను లేదా డేటా యాక్సెస్‌ను నిలిపేయాలనే ముప్పు ఉంది. అలాంటి పరిస్థితే వస్తే మన బ్యాంకింగ్, పాలన, రక్షణ వ్యవస్థలకు అంతరాయం కలుగుతుంది.

దీనిని పరిష్కరించడానికి, ప్రభుత్వం సావరిన్ క్లౌడ్, స్వదేశీ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్), స్వదేశీ సైబర్ సెక్యూరిటీ, డేటా-ఆధారిత ఏఐని ప్రారంభించాలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు. భారత ప్రభుత్వం తప్పనిసరిగా 2030 నాటికి డిజిటల్‌ స్వరాజ్‌ మిషన్‌ను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అప్పటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ, సోషల్‌ మీడియా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. చైనా, యూరప్ దేశాలు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సొంత టెక్‌ సాధనలో భారత్‌ వెనకబడుతోందని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. భారత్‌కు ఉన్న అతిపెద్ద సామర్థ్యం ప్రజల డేటా, దానివల్ల మన వినియోగదారుల డేటా అమెరికాలో వేగంగా పెరుగుతున ఏఐ, దాని ఆదాయాలకు ఇంధంగా మారుతోందని జీటీఆర్ఐ హెచ్చరించింది.

Next Story