Real Estate: 2047 నాటికి 5-10 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్న భారత రియల్ ఎస్టేట్

by S Gopi |

దీనివల్ల దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి దాదాపు ఐదో వంతు సహకారమని నివేదిక పేర్కొంది.

Real Estate: 2047 నాటికి 5-10 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్న భారత రియల్ ఎస్టేట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా 2047 నాటికి 5-10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కొలియర్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) సంయుక్త నివేదిక తెలిపింది. అంటే మన కరెన్సీలో ఇది రూ. 441.5 లక్షల కోట్ల నుంచి రూ. 883.2 లక్షల కోట్లకు పెరగవచ్చు. దీనివల్ల దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి దాదాపు ఐదో వంతు సహకారమని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్లు(రూ. 353.2 లక్షక కోట్లు)గా ఉన్న మన దేశ జీడీపీ, 2047 నాటికి రూ. 35-40 ట్రిలియన్ డాలర్ల(రూ. 3,091-3,533 లక్షల కోట్ల)కు పెరుగుతుందని నివేదిక అంచనా కట్టింది. ప్రధానంగా పట్టణీకరణ, మౌలిక సదుపాయాల వృద్ధి, పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా ప్రస్తుతం 0.3 ట్రిలియన్ డాలర్లు(రూ. 26.5 లక్షల కోట్లు) అంటే జీడీపీ 6-8 శాతం విలువ కలిగిన రియల్ ఎస్టేట్ రంగం 2047 సమయానికి జీడీపీలో 14-20 శాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో మార్పు, పెరుగుతున్న ఆదాయం, సొంత ఇళ్లు ఉండాలనే ఆసక్తి కారణంగా నివాస ఇళ్ల అమ్మకాలు ప్రస్తుతం ఉన్న 3-4 లక్షల యూనిట్ల నుంచి 2047 నాటికి 8-10 లక్షల యూనిట్లకు పెరుగుతాయని అంచనా.

Next Story