- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Smartphones: స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త రూల్స్
మొత్తం 83 రకాల భద్రతా ప్రమాణాలను ప్రభుత్వం ప్రతిపాదించగా, అవేవీ ప్రపంచస్థాయి ప్రమాణాల పరిధిలో లేవని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భద్రతను పెంచేందుకు కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. వీటిలో ఫోన్ తయారీదారులు తమ ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్‌ను ప్రభుత్వానికి అందించడం, యాప్‌ల బ్యాక్‌గ్రౌండ్ యాక్సెస్‌ను పరిమితం చేయడం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల గురించి ప్రభుత్వానికి ముందుగా తెలియజేయడం వంటివి ఉన్నాయి. అయితే, వీటిపై యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలు ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం 83 రకాల భద్రతా ప్రమాణాలను ప్రభుత్వం ప్రతిపాదించగా, అవేవీ ప్రపంచస్థాయి ప్రమాణాల పరిధిలో లేవని, మొబైల్‌ఫోన్ వాడే కస్టమర్ల వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేసేవిగా ఉన్నాయని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి.
75 కోట్లకు పైగా ఫోన్‌లతో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన భారత్‌లో ఆన్‌లైన్ మోసాలు, డేటా ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. వీటి నుంచి వినియోగదారుల డేటా భద్రతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ కొత్త నిబంధనలు ఒక భాగం. దీనిపై ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. పరిశ్రమలో ఏవైనా చట్టబద్ధమైన ఆందోళనలను ఓపెన్ మైండ్‌తో పరిష్కరిస్తాం. ముందస్తుగా నిర్ణయానికి రావడం సరికాదని అన్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి కేంద్రం ప్రతిపాదించిన అంశాలు ఏంటి, వాటిని కంపెనీలు ఎందుకనీ వ్యతిరేకిస్తున్నాయనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
అసలు విషయమేంటంటే
భారత ప్రభుత్వం దేశంలో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌ల కోసం కొత్త భద్రతా నిబంధనలను ప్లాన్ చేస్తోంది. ఇవి యాపిల్, శామ్‌సంగ్, గూగుల్, షియోమి, ఇతర కంపెనీలకు వర్తిస్తాయి.
హ్యాకింగ్, స్పయింగ్, సైబర్ దాడుల నుంచి వినియోగదారులను రక్షించడానికి ఈ నిబంధనలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ఫోన్ సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుందనే దానిపై అధికారులు మరింత నియంత్రణ, విజబిలిటీని కోరుతున్నారు, తద్వారా అధికారులు సెక్యూరిటీ రిస్క్‌లను తనిఖీ చేయవచ్చు.
అయితే, టెక్ కంపెనీలతో పాటు టెక్ దిగ్గజాలకు ప్రాతినిధ్యం వహించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తయారీదారుల సంఘం(ఎంఏఐటీ) వీటిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన అనేక డిమాండ్లు సాంకేతికంగా కష్టమైనవి, కస్టమర్ల గోప్యతకు హానికరం, ఫోన్‌ల పనితీరు నెమ్మదించవచ్చు, బ్యాటరీ లైఫ్ పడిపోతుంది. కొన్ని ప్రపంచస్థాయి కంపెనీ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని వారు వాదిస్తున్నారు. సోర్స్ కోడ్ లాంటి సున్నితమైన సమాచారాన్ని ప్రభుత్వంతో పంచుకోవడం వల్ల కంపెనీ రహస్యాలు, భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని కూడా ఆందోళన చెందుతున్నాయి. వాటిలో కీలకమైనవి..
ప్రభుత్వానికి సోర్స్ కోడ్ ఇవ్వడం
మొబైల్‌ఫోన్ తయారీదారులు తమ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ సోర్స్ కోడ్‌ను ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్‌లతో పంచుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. భద్రత కోసం ఈ ల్యాబ్‌లు ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తనిఖీ చేస్తాయి.
దీన్ని కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది సాధ్యం కాదని, సోర్స్ కోడ్ అనేది కంపెనీ రహస్యం, దీన్ని పంచుకోవడం వల్ల మేధో సంపత్తి చోరీ జరిగే ప్రమాదం ఉంది. ప్రపంచస్థాయి గోప్యత, భద్రతా విధానాలు దీన్ని అనుమతించవని చెబుతున్నాయి.
బ్యాక్‌గ్రౌడ్ పర్మిషన్ పరిమితులు (కెమెరా, మైక్, లొకేషన్)
ఫోన్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్న సమయంలో యాప్‌లు కెమెరా, మైక్రోఫోన్ లేదా లొకేషన్ ఉపయోగించకూడదు. అలా చేస్తే, స్క్రీన్‌పై నోటిఫికేషన్ కనిపించాలని ప్రభుత్వం అడుగుతోంది.
దీన్ని కూడా కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదు. దీన్ని ఎలా సరిగ్గా పరీక్షించాలో లేదా అమలు చేయాలో ప్రభుత్వం వివరించలేదని తెలిపాయి.
రెగ్యులర్ పర్మిషన్ రివ్యూ అలర్ట్‌లు
మొబైల్ ఫోన్‌లలో వినియోగదారులకు అన్ని యాప్‌లకు సంబంధించి పర్మిషన్స్‌ను సమీక్షించేందుకు క్రమం తప్పకుండా గుర్తు చేయాలి, అలర్ట్స్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, దీనివల్ల ఎక్కువ అలర్ట్స్ పెరిగి వినియోగదారులు ఇబ్బంది పడతారని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ ప్రమాదకరమైతేనే అనుమతుల కోసం అలర్ట్స్ ఉండాలంటున్న్నాయి.
సెక్యూరిటీ లాగ్‌ల స్టోరేజ్
ఫోన్‌లలో యాప్ ఇన్‌స్టాల్స్, లాగ్-ఇన్ అటెంప్ట్స్‌లకు సంబంధించి 12 నెలల పాటు సెక్యూరిటీ రికార్డులను నిల్వ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే, చాలామంది వినియోగదారుల ఫోన్‌లలో తగినంత నిల్వ ఉండదు. ఈ నిబంధనలు అమలైతే డివైజ్‌లు నెమ్మదిస్తాయని స్పష్టం చేస్తున్నాయి.
తరచూ మాల్వేర్ స్కానింగ్
మాల్వేర్ లేదా హానికరమైన యాప్‌లను గుర్తించడానికి ఫోన్‌లలో క్రమం తప్పకుండా స్కాన్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నిరంతరం స్కానింగ్ వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. ఇది ఫోన్ పనితీరును దెబ్బతీయవచ్చని కంపెనీ వివరిస్తున్నాయి.
ప్రీ-ఇన్‌స్టాల్ యాప్‌ల తొలగింపు
బేసిక్ ఫోన్ ఫంక్షన్‌కు అవసరమైనవి తప్ప, అన్ని ప్రీ-ఇన్‌స్టాల్ యాప్‌లను వినియోగదారులు డిలీట్ చేసే సదుపాయం ఉండటంపైనా కంపెనీలు వ్యతిరేక్సితున్నాయి. చాలా వరకు ప్రీ-ఇన్‌స్టాల్ యాప్‌లు ప్రధాన సిస్టమ్ భాగాలు. వాటిని తీసివేయడం వల్ల ఫోన్ ఫంక్షనింగ్ దెబ్బతింటుందని కంపెనీ పేర్కొంటున్నాయి.
మేజర్ అప్‌డేట్ గురించి ప్రభుత్వానికి ముందే చెప్పాలి
కంపెనీలు ప్రధాన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లేదా భద్రతా ప్యాచ్‌లను విడుదల చేసే ముందు ప్రభుత్వానికి తెలియజేసే నిబంధనపైనా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సెక్యూరిటీ అప్‌డేట్‌లను వెంటనే విడుదల చేయాలి. ఆమోదం కోసం వేచి ఉండటం వల్ల కస్టమర్లు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంది.
పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ల బ్లాక్ (యాంటీ-రోల్‌బ్యాక్)
సెక్యూరిటీ డౌన్‌గ్రేడ్‌లను నివారించడానికి ఫోన్‌లలో పాత సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్‌ను శాశ్వతంగా బ్లాక్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని నిబంధన అని, దీన్ని అమలు చేస్తే, కొంతమంది కస్టమర్లకు, డెవలపర్‌లకు పరీక్ష కోసం పాత వెర్షన్‌లు అవసరమని కంపెనీ వెల్లడించాయి.






