WGC: తగ్గిన గోల్డ్ డిమాండ్

by S Gopi |   (  Updated:2025-04-30 15:23:41  IST  )

అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్‌కు ముందు కొనుగోళ్లు సెంటిమెంట్‌ను సానుకూలంగా మార్చవచ్చని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ చెప్పారు

WGC: తగ్గిన గోల్డ్ డిమాండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అత్యధిక ధరల కారణంగా బంగారానికి గిరాకీ తగ్గింది. గతేడాది వరకు స్థిరమైన వృద్ధిని చూసిన పసిడి, ఈ ఏడాదిలో ఇప్పటివరకూ దాదాపు 20 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ఫలితంగా వినియోగదారులు బంగారం కొనడానికే దూరంగా ఉంటున్నారు. దీనివల్ల ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో పసిడి గిరాకీ 15 శాతం క్షీణించి 118.1 టన్నులకు చేరుకుందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) బుధవారం ప్రకటనలో తెలిపింది. సాధారణంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పుడు వినియోగదారుల నుంచి అధిక డిమాండ్ కనిపిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. విలువ పరంగా బంగారం 22 శాతం పెరిగి రూ. 98 వేల స్థాయికి చేరింది. అయినప్పటికీ గిరాకీ పడిపోయింది. కేవలం కొన్ని వారాల వ్యవధిలో బంగారం ధరలు ఊహించని విధంగా పెరగడమే ఇందుకు కారణమని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. అత్యధిక ధరలు కొనుగోళ్లతో పాటు ఎంక్వైరీలపై కూడా ప్రభావితం చూపింది. అయినప్పటికీ, ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా చాలామందికి బంగారం సాంస్కృతిక ప్రాముఖ్యతగానే ఉంది. ముఖ్యంగా అక్షయ తృతీయ, రాబోయే పెళ్లిళ్ల సీజన్‌కు ముందు కొనుగోళ్ల సెంటిమెంట్‌ను సానుకూలంగా మార్చవచ్చని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సచిన్ జైన్ చెప్పారు.

ధరలు ఎంత పెరిగినా దేశీయంగా ప్రజలు ఎంతోకొంత బంగారం కొనడానికే మొగ్గు చూపుతున్నారని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. ముఖ్యంగా తక్కువ పరిమాణంలో లేదా తేలికైన ఆభరణాల కొంటున్నారు. కొంతమంది ధరలు తగ్గుతాయనే అంచనాలతో ఎదురు చూస్తునారు. మరోవైపు అనిశ్చిత పరిస్థితుల మూలంగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్న వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా బంగారు కడ్డీలు, నాణెలకు గిరాకీ అధికంగా ఉంది. కాగా, ప్రస్తుతం దేశ రాజధాని మార్కెట్లో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ. 97,910 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 89,750 వద్ద ఉంది. వెండి కిలో రూ. 1,09,000 గా ఉంది.

Next Story