- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gen-Z Billionaires: వారసత్వ వ్యాపారాలు వద్దంటున్న జెన్-జీలు
దిలీప్ పిరమల్.. మా కుటుంబంలో తర్వాతి తరం వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపడంలేదని అన్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వ్యాపార రంగంలో తరాలుగా సామాజ్యాలను స్థాపించిన వారసులు క్రమంగా వాటిపై ఆసక్తి కోల్పోతున్నారు. తమ పెద్దవాళ్లు నడిపిన వ్యాపారాన్నే కొనసాగించాలనే నియమానికి దూరం జరుగుతూ, కొత్త తరం జెన్-జీలు తమకంటూ సొంత ఉనికిని సృష్టించే పనిలో పడ్డారు. ఇటీవల యాభై ఏళ్లకు పైగా భారత లగేజ్ తయారీలో ఆధిపత్యం చెలాయించిన వీఐపీ ఇండస్ట్రీస్ అధినేత దిలీప్ పిరమల్ తన రూ. 6,800 కోట్ల విలువైన కంపెనీలో ఏకంగా 32 శాతం వాటాను అమ్మేస్తున్నట్టు ప్రకటించారు. సంస్థలో తమకున్న 51.73 శాతం వాటాలో 32 శాతం ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులకు, ఇతరులకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించారు. ఆ సందర్భంగా దిలీప్ పిరమల్.. మా కుటుంబంలో తర్వాతి తరం వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపడంలేదని అన్నారు. ఐదు దశాబ్దాలుగా మార్కెట్ లీడర్‌గా కొనసాగామని, గత ఐదేళ్లలో క్రమంగా మార్కెట్ వాటా కోల్పోతున్నామని చెప్పారు. అయితే, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీయే చేసిన పిరమల్ కుమార్తె రాధిక, కొన్ని సంవత్సరాలు సీఈఓగా పనిచేసి 2017లో తన జీవిత భాగస్వామితో లండన్‌కు మకాం మార్చింది. ఆమె స్వలింగ వివాహం భారత్‌లో చట్టబద్ధం కాకపోవడమే ఇందుకు కారణం. ఇది కూడా ఆమె సంస్థకు దూరం జరిగేందుకు కారణం కావొచ్చు.
వారసులు లేని వ్యాపారవేత్త పిరమల్ మాత్రమే కాదు, నేడు దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల వారసులలో కొందరు దాతృత్వం, కళలు, క్రీడల వైపు మొగ్గుచూపుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత జెన్-జీ బిలియనీర్లు స్వతంత్ర జీవనశైలి, కొత్త ఆవిష్కరణలు, వ్యక్తిగత సంతృప్తి కోసం లెగసీ కుటుంబ వ్యాపారాల నుంచి దూరం జరుగుతున్నారు. ఇది సులభంగా నిధులు లభించే భారత వ్యాపార సామ్రాజ్యాల్లో మారుతున్న ధోరణిని ప్రతిబింబిస్తుంది.
లెగసీ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న జెన్-జీ బిలియనీర్లు
* రోష్ని నాడార్ మల్హోత్రా: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా కంపెనీ రోజువారీ కార్యకలాపాల కంటే వన్యప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమె తండ్రి ఈ ఏడాది మార్చిలో ఆమెకు కుటుంబ నియంత్రణ వాటాను బహుమతిగా ఇచ్చారు. కానీ ఆమె తన ఇష్టాలకు అనుగుణంగా ఇతర కార్యకలాపాలు చూస్తుండటంతో టెక్ సంస్థ నిర్వహణను ఇతర నిపుణులు నిర్వహిస్తున్నారు.
* అనన్య బిర్లా: గాయనిగా-గేయరచయితగా మంచి పేరున్న అనన్య బిర్లా వ్యాపార రంగంలో కంటే కళలను ఎక్కువ ఇష్టపడుతుంటారు. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న సిమెంట్ బ్రాండ్ నుంచి వచ్చిన ఆమె ఘనశ్యామ్ దాస్ బిర్లా ముని-ముని మనవరాలు. కళలతో పాటు అనన్య బిర్లా, సొంతంగా గ్రామీణ మహిళల్లో ఆర్థిక స్వావలంబన కోసం ఫైనాన్స్ కంపెనీ బాధ్యతలు చూస్తున్నారు. అలాగే, ఓ బ్యూటీ బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు.
* హల్దిరామ్స్ కుటుంబం: కొన్ని నెలల క్రితం 90 ఏళ్ల భారతీయ స్నాక్స్ బ్రాండ్‌ను నిర్వహిస్తున్న కుటుంబం వారసత్వ కొనసాగింపు కరువై సింగపూర్‌కు చెందిన టెమాసెక్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర గ్లోబల్ ఇన్వెస్టర్లకు మైనారిటీ వాటాను విక్రయించింది. హల్దిరామ్ కుటుంబం నిజానికి సంవత్సరాలుగా అంతర్గత విభేదాలు, వివాదాలను ఎదుర్కొంది.
ఈ ధోరణి వెనుక కారణాలు
* ఆర్థిక వెసులుబాటు: పబ్లిక్, ప్రైవేట్ ఈక్విటీ కారణంగా నిధులు లభించడం ఇప్పుడు చాలా సులభంగా మారింది. కొత్త ఆంట్రప్రెన్యూర్‌లకు నిధుల విషయంలో గతంలో మాదిరి సమస్యలు లేవు. దీనివల్ల కుటుంబం నిర్వహించే సంస్థల నుంచి నిధులు పొందాలనేం లేకుండా పోయింది.
* వారసత్వం పట్ల మారుతున్న వైఖరి: వారసత్వంగా కుటుంబ వ్యాపారాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనను జెన్-జీలు వదులుకుంటున్నారు. బదులుగా వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
* ఆర్థిక శక్తి: కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైన ఆర్థిక శక్తి, ముఖ్యంగా వ్యాపార కుటుంబాల్లోని యువతరానికి కొత్త విషయాలను ప్రయత్నించడానికి వీలు కల్పిస్తోంది.
భారత వ్యాపారంపై ప్రభావం
* కొత్త వ్యాపార అవకాశాలు: వారసత్వ కుటుంబ వ్యాపారాల నుంచి బయటకు రావడం ద్వారా కొత్త వ్యవస్థాపక వెంచర్లకు, ఆవిష్కరణలకు అవకాశం లభిస్తుంది.
* కుటుంబాల్లో మార్పు: కుటుంబ వ్యాపారాన్ని విడిచిపెట్టాలనే నిర్ణయం వెనుక వారసుల మధ్య విభేదాలు, సవాళ్లు కూడా ఒక కారణం. దీనివల్ల కొన్ని వ్యాపారాలు కనుమరుగు అవ్వొచ్చు.
* కొత్త బిజినెస్ మోడల్: కంపెనీలు కొత్త తరాల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మారనున్నాయి. దీనివల్ల కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయి.






