- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jewellary Exports: భారత రత్నాభరణాల ఎగుమతుల్లో 12 శాతం క్షీణత
మార్చి నెలలో ఎగుమతులు కొద్దిగా మెరుగుపడి 2.58 బిలియన్ డాలర్ల(రూ. 22,340.89 కోట్ల)కు చేరాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత రత్నాభరణాల ఎగుమతులు 11.72 శాతం క్షీణించి 28.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2.41 లక్షల కోట్లు) చేరుకున్నాయి. ఈ మేరకు రత్నాభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. జీజేఈపీసీ డేటా ప్రకారం, 2023-24లో మొత్తం రత్నాభరణాల ఎగుమతులు 32.2 బిలియన్ డాలర్లు (రూ. 2.67 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. అయితే, మార్చి నెలలో ఎగుమతులు కొద్దిగా మెరుగుపడి 2.58 బిలియన్ డాలర్ల(రూ. 22,340.89 కోట్ల)కు చేరాయి. గతేడాది ఇదే నెలలో రూ. 21,228 కోట్ల ఎగుమతులు నమోదయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చైనాతో పాటు భారత్‌లోని కీలక ఎగుమతి మార్కెట్‌లలో డిమాండ్ తగ్గుముఖం పట్టింది. దీని వల్ల రత్నాభరణాల ఎగుమతులు క్షీణించాయి. ఇదే సమయంలో వజ్రాల ధరలు 10-15 శాతం మేర తగ్గడం కూడా విలువపై ప్రభావం చూపాయి. ఈ కారణంగానే ఎగుమతులు మొత్తంలో క్షీణత నమోదైందని జీజేఈపీసీ చైర్మన్ చెప్పారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ ఎగుమతులు 16.75 శాతం తగ్గి రూ. 1.12 లక్షల కోట్లకు చేరాయి. పాలిష్ చేసిన ల్యాబ్ వజ్రాలు 9.64 శాతం పడిపోయి రూ. 10,716 కోట్లుగా ఉన్నాయి. బంగారం ఎగుమతులు అత్యల్పంగా 0.11 శాతం తగ్గి రూ. 93,066 కోట్లుగా నమోదయ్యాయి. వెండి ఎగుమతులు 40.58 శాతం క్షీణించి రూ. 8,115 కోట్లుగా ఉన్నాయి. అయితే, ప్లాటినం ఎగుమతులు 11.79 శాతం పెరిగి రూ. 1,547 కోట్లు నమోదయ్యాయి.






