GJEPC: డిసెంబర్‌లో 10 శాతం క్షీణించిన రత్నాభరణాల ఎగుమతులు

by S Gopi |

కొనుగోలుదారుల నుంచి డిమాండ్ నెమ్మదించడం, పెట్టుబడిదారులకు బంగారం సురక్షితమైన పెట్టుబడి కావడంతో ఎగుమతులపై ప్రభావం

GJEPC: డిసెంబర్‌లో 10 శాతం క్షీణించిన రత్నాభరణాల ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది డిసెంబర్‌లో రత్నాభరణాల ఎగుమతులు క్షీణించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ నెమ్మదించడం, పెట్టుబడిదారులకు బంగారం సురక్షితమైన పెట్టుబడి కావడంతో ఎగుమతులపై ప్రభావం కనిపించిందని రత్నాభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) అభిప్రాయపడింది. జీజేఈపీసీ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెలలో 1.96 బిలియన్ డాలర్ల(రూ. 17 వేల కోట్ల) విలువైన రత్నాభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే 10.29 శాతం క్షీణించాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలు ప్రభావితం చేసినప్పటికీ, ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణతో రానున్న రోజుల్లో ఎగుమతులు పుంజుకుంటాయని జీజేఈపీసీ ఆశిస్తోంది. ఇదే నెలలో రత్నాభరణాల దిగుమతులు 27.23 శాతం క్షీణిచ్ని రూ. 13 వేల కోట్లకు క్షీణించాయి. పండుగలు, వివాహ వేడుకల తర్వాత అమ్మకాలు తగ్గిపోవడం, మెలీయనీల్స్‌తో పాటు జెన్-జీ తరం తేలికపాటి ఆభరణాలను ఎక్కువ ఇష్టపడుతుండటం వల్లనే దిగుమతులు కూడా తగ్గాయని నివేదిక తెలిపింది. సమీక్షించిన నెలలో బంగారు ఆభరణాల ఎగుమతులు 3.56 శాతం తగ్గి రూ. 7,510 కోట్లకు చేరాయి.

Next Story