Economy: ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి 7.5-7.8 శాతం: డెలాయిట్

by S Gopi |

నిరంతరం కొనసాగుతున్న ప్రపంచ అనిశ్చితుల కారణంగా వచ్చే 2026-27లో 6.6-6.9 శాతంతో స్వల్పంగా నెమ్మదించవచ్చని డెలాయిట్ ఇండియా బుధవారం ప్రకటనలో తెలిపింది.

Economy: ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి 7.5-7.8 శాతం: డెలాయిట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ మెరుగైన వృద్ధిని సాధిస్తుందని డెలాయిట్ ఇండియా అభిప్రాయపడింది. ఇందుకు పండుగ సీజన్ డిమాండ్‌కు తోడు దేశంలో సేవల రంగ కార్యకలాపాల మద్దతు కారణంగా దేశ జీడీపీ 7.5-7.8 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. అయితే, నిరంతరం కొనసాగుతున్న ప్రపంచ అనిశ్చితుల కారణంగా వచ్చే 2026-27లో 6.6-6.9 శాతంతో స్వల్పంగా నెమ్మదించవచ్చని డెలాయిట్ ఇండియా బుధవారం ప్రకటనలో తెలిపింది. గతేడాది భారత్ దేశీయ డిమాండ్‌లో అత్యంత సానుకూల స్థిరత్వాన్ని చూసింది. ప్రధానంగా ఆర్థిక, ద్రవ్య, కార్మిక విధానాల్లో జరిగిన సంస్కరణలు, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలతో 2025 గుర్తుండిపోతుంది.

వాణిజ్యపరమైన అంతరాయాలు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో విధాన మార్పులు, విదేశీ నిధులకు సంబంధించి నెలకొన్న గందరగోళం వంటి ప్రపంచ ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశ వాస్తవ జీడీపీ 8 శాతం పెరిగింది. ద్వితీయార్థంలో పండుగ డిమాండ్, సేవల రంగ కార్యకలాపాల మద్దతుతో 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి 7.5-7.8 శాతంగా ఉండొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్-యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందం ముగుస్తుందని మేము అంచనా వేస్తున్నాము, దీనివల్ల విదేశీ పెట్టుబడుల పునరుద్ధరణకు దారితీయవచ్చని, తద్వారా భారత కరెన్సీ స్థిరపడుతుందని డెలాయిట్ ఇండియా, ఆర్థికవేత్త, రుమ్కి మజుందార్ పేర్కొన్నారు.

Next Story