India GDP: గత పదేళ్లలో రెండింతలు పెరిగిన భారత జీడీపీ

by S Gopi |

2025-26 మూడో త్రైమాసికం నాటికి భారత్ జపాన్‌ను అధిగమించవచ్చని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.

India GDP: గత పదేళ్లలో రెండింతలు పెరిగిన భారత జీడీపీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన పదేళ్ల కాలంలో భారత స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) రెండింతలు పెరిగిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తెలిపింది. ప్రస్తుత ధరల ప్రకారం, 2015లో దేశ జీడీపీ 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2025 చివరి నాటికి ఇది 4.27 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐఎంఎఫ్ తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ప్రస్తుత ఏడాదికి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉందని పేర్కొంది. ఇది దేశ ఆర్థికవ్యవస్థ స్థిరమైన, సమర్థవంతమైన వృద్ధిని సూచిస్తుంది. 2025-26 మూడో త్రైమాసికం నాటికి భారత్ జపాన్‌ను అధిగమించవచ్చని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. గత దశాబ్దంలో భారత ఆర్థిక వృద్ధి అనేక ప్రధాన ప్రపంచ ఆర్థికవ్యవస్థలను అధిగమించింది. సమీక్షించిన కాలంలో భారత జీడీపీ 105 శాతం పెరిగితే, యూఎస్ 66 శాతం, చైనా 44 శాతం వృద్ధిని సాధించాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే వంటి ఇతర అభివృద్ధి చెందిన దేశాలు చాలా తక్కువ వృద్ధి రేటును నమోదు చేశాయి. ప్రస్తుతం జపాన్ జీడీపీ 4.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. 2027 నాటికి దాన్ని అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరిస్తుంది.

భారత వృద్ధిలో కీలక మైలురాళ్లు:

* 2007లో, భారత్ మొదటి 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ మార్కును చేరుకుంది. దీనికి 60 సంవత్సరాలు పట్టింది.

* 2014 నాటికి, జీడీపీ 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

* కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, భారత్ 2021లో 3 ట్రిలియన్ డాలర్లను దాటింది.

* ఆ తర్వాత, 3 ట్రిలియన్ డాలర్ల నుంచి 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి భారత్‌కు కేవలం నాలుగేళ్లు పట్టింది.

ఈ వేగంతో, భారత ఆర్థికవ్యవస్థ ప్రతి ఏడాదిన్నరకు 1 ట్రిలియన్‌ డాలర్లను జోడిస్తుంది. తద్వారా 2032 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రస్తుతం, అమెరికా జీడీపీ 30.3 ట్రిలియన్‌ డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా కొనసాగుతోంది. చైనా 19.5 ట్రిలియన్‌ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. భారత్ వేగవంతమైన వృద్ధి కొనసాగిస్తే, రాబోయే దశాబ్దంలో ఈ రెండు ఆర్థిక దిగ్గజాలతో పోటీ పడగలదని ఐఎంఎఫ్ పేర్కొంది.

Next Story