Water Management: నీటి కొరతతో భారత్‌కు కొత్త ఆర్థిక ముప్పు

by S Gopi |

ప్రస్తుతం దేశంలో నీటి నిర్వహణ ప్రధానంగా రాష్ట్రాల పరిధిలో ఉండటం, ధరలపై భారీ సబ్సిడీలు కొనసాగడం, ఒక రంగం నుంచి మరో రంగానికి నీటి కేటాయింపులను మార్చే ప్రక్రియ నెమ్మదిగా ఉండటం వంటి అంశాలు సమస్యను మరింత క్లిష్టం చేస్తున్నాయని పేర్కొంది.

Water Management: నీటి కొరతతో భారత్‌కు కొత్త ఆర్థిక ముప్పు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో నీటి నిర్వహణ వ్యవస్థలో ఉన్న లోపాలు భవిష్యత్తులో నీటి కొరతను మరింత తీవ్రమయ్యేలా చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై కూడా అదనపు ఒత్తిడి తీసుకురావచ్చని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ రేటింగ్స్ హెచ్చరించింది. ప్రస్తుతం దేశంలో నీటి నిర్వహణ ప్రధానంగా రాష్ట్రాల పరిధిలో ఉండటం, ధరలపై భారీ సబ్సిడీలు కొనసాగడం, ఒక రంగం నుంచి మరో రంగానికి నీటి కేటాయింపులను మార్చే ప్రక్రియ నెమ్మదిగా ఉండటం వంటి అంశాలు సమస్యను మరింత క్లిష్టం చేస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం దేశంలోని మంచినీటి వనరుల్లో సుమారు 80 శాతం వినియోగిస్తున్నప్పటికీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా విధానాలు అమలు చేస్తుండటం, మారిన పరిస్థితులకు అనుగుణంగా నీటి పునఃకేటాయింపులు వేగంగా చేయలేకపోవడం, కొత్త వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెట్టడానికి స్థానిక సంస్థల దగ్గర నిధులు లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ఈ ఫ్లెక్సిబిలిటీ లేని సిస్టమ్ వల్ల భవిష్యత్తులో పబ్లిక్ సర్వీసెస్, ఇండస్ట్రీలు నిలిచిపోయి ప్రభుత్వాలపై రుణ భారం, ద్రవ్యోల్బణ ఒత్తిడి విపరీతంగా పెరుగుతాయని నివేదిక తేల్చిచెప్పింది.

80శాతం నీరు అక్కడే.. సబ్సిడీల రాజకీయం తెస్తున్న ముప్పు

దేశంలో లభ్యమవుతున్న మొత్తం మంచినీటిలో సింహభాగం(దాదాపు 80 శాతం) ఒక్క వ్యవసాయ రంగానికే వినియోగమవుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా సాగునీటికి, కరెంట్‌కు ఇస్తున్న భారీ సబ్సిడీల వల్ల భూగర్భ జలాలు నిలువునా హరించుకుపోతున్నాయని మూడీస్ ప్రస్తావించింది. పాతబడిపోయిన నీటి మౌలిక సదుపాయాలు ఒకవైపు, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు మరోవైపు దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి తోడు 'వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్' అంచనాల ప్రకారం.. భారత్ ఇప్పటికే విపరీతమైన వడగాల్పులు, అకాల వరదలు, రుతుపవనాల అస్థిరత వంటి వాతావరణ మార్పులతో భారీగా నష్టపోతోంది. ఇవన్నీ కలిసి అటు పర్యావరణాన్ని, ఇటు దేశ క్రెడిట్ రేటింగ్‌ను దెబ్బతీసే స్థాయిలో అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి.

ఏఐ, డేటా సెంటర్లతో కొత్త సవాలుగా వాటర్ క్రైసిస్

ప్రస్తుతం దేశంలో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అప్లికేషన్లు వేగంగా విస్తరిస్తుండటంతో 'డేటా సెంటర్ల' ఏర్పాటు భారీగా పెరుగుతోంది. అయితే, ఈ హైటెక్ డేటా సెంటర్లలో సర్వర్లను చల్లబరచడానికి అత్యధిక పరిమాణంలో నీరు అవసరమవుతుంది. ఐటీ, ఏఐ విప్లవం తెస్తున్న ఈ సరికొత్త పారిశ్రామిక నీటి డిమాండ్ రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు, వాటర్ యుటిలిటీ బోర్డులకు అగ్నిపరీక్షగా మారబోతోందని మూడీస్ పేర్కొంది. ఒకవైపు వ్యవసాయం, మరోవైపు ప్రజల అవసరాలు, ఇంకోవైపు డేటా సెంటర్ల లాంటి నయా టెక్నాలజీ పరిశ్రమల డిమాండ్ వీటన్నింటి మధ్య నీటిని సరిగ్గా సర్దుబాటు చేయకపోతే పారిశ్రామిక వృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది.

Next Story