Auto Exports: తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయి వాహనాల ఎగుమతులు

by S Gopi |

ప్యాసింజర్ వాహనాల విభాగంలో రికార్డు స్థాయి ఎగుమతులు జరిగాయని సియామ్ వెల్లడించింది.

Auto Exports: తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయి వాహనాల ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత మార్కెట్ నుంచి వాహనాల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఆటోమొబైల్ ఎగుమతులు 22 శాతం పెరిగాయని పరిశ్రమ సంఘం సియామ్ ఆదివారం ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాల విభాగంలో రికార్డు స్థాయి ఎగుమతులు జరిగాయని, టూ-వీలర్, కమర్షియల్ వాహనాల విభాగాల్లోనూ మెరుగైన గణాంకాలు నమోదైనట్టు సియామ్ వెల్లడించింది. అన్ని విభాగాలు కలిపి సమీక్షించిన మొదటి త్రైమాసికంలో మొత్తం 14.57 లక్షల వాహనాలు మనదేశం నుంచి ఎగుమతి అయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 11.92 లక్షల వాహనాలు సరఫరా అయ్యాయి. ప్యాసింజర్ వాహనాల విభాగంలో 13 శాతం అధికంగా 2,04,330 యూనిట్లతో ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరాయి.

ప్రపంచ మర్కెట్లో కొనసాగుతున్న డిమాండ్‌కు తోడు మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా లాంటి ప్రాంతాల్లో అమ్మకాల కారణంగానే ఈ విభాగంలో రికార్డు స్థాయి ఎగుమతులు జరిగాయని సియామ్ అభిప్రాయపడింది. అలాగే, శ్రీలంక, నేపాల్ లాంటి పొరుగు దేశాలతో పాటు జపాన్‌లో గిరాకీ రికవరీ కావడం ఇందుకు ఆస్కారం ఏర్పడింది. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఈ విభాగంలో ఎక్కువ లాభపడింది. తొలి త్రైమాసికంలో కంపెనీ మొత్తం 96,181 యూనిట్లను ఎగుమతి చేసి 37 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. మొత్తం ఎగుమతుల్లో మారుతీ సుజుకి వాటా కూడా 47 శాతంతో చారిత్రాత్మక గరిష్ఠానికి చేరింది. దీని తర్వాత హ్యూండాయ్ ఎగుమతుల్లో 13 శాతం పెరుగుదలను చూసింది. ఇక, టూ-వీలర్ విభాగంలో వాహనాల ఎగుమతులు 23 శాతం పెరిగి 11.37 లక్షలుగా నమోదయ్యాయి. కమర్షియల్ విభాగంలోనూ 23 శాతం అధికంగా 19,427 యూనిట్లు ఎగుమతి అయినట్టు సియామ్ పేర్కొంది.

Next Story