AI Market: 3 రెట్లు పెరగనున్న భారత ఏఐ మార్కెట్

by S Gopi |

2027 నాటికి భారత ఏఐ మార్కెట్ 17 బిలియన్ డాలర్ల(రూ. 1.45 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని అంచనా.

AI Market: 3 రెట్లు పెరగనున్న భారత ఏఐ మార్కెట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇతర దేశాలతో పోలిస్తే భారత మార్కెట్లో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం అత్యంత వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీలో పెట్టుబడులు ఊపందుకోవడం, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వాడకం, నైపుణ్యం ఉన్న ఉద్యోగులు ఎక్కువగా అందుబాటులో ఉండటం వంటి కారణాలతో ఏఐ మార్కెట్ పుంజుకుంటోందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) తన నివేదికలో వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం, 2027 నాటికి భారత ఏఐ మార్కెట్ 17 బిలియన్ డాలర్ల(రూ. 1.45 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని అంచనా. ఇది ప్రస్తుతం ఉన్న పరిమాణం కంటే మూడు రెట్లు అధికం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ టాలెంట్‌లో భారత్ 16 శాతం వాటా కలిగి ఉంది. దేశంలో ఉన్న అధిక జనాభా, పటిష్టమైన స్టెమ్ విద్యా వ్యవస్థ ద్వారా ఈ ప్రయోజనం లభించింది. భారత్ తర్వాత ఎక్కువ ఏఐ ప్రతిభ ఉన్న జానాభా అమెరికాలో ఉంది. భారత్ 6 లక్షల కంటే ఎక్కువ ఏఐ స్కిల్స్ ఉన్న వ్యక్తులు, 70 కోట్ల కంటే ఎక్కువ ఇంటర్నెట్ యూజర్లు, గత మూడేళ్లలో 2,000 కంటే ఎక్కువ ఏఐ స్టార్టప్‌లతో ఏఐ ఎకోసిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ క్రమంలో 2027 నాటికి రూ. 1.45 లక్షల కోట్లకు చేరడం సులభం. తద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఏఐ ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా మనదేశం ఉండనుంది.

కొత్తగా 45 డేటా సెంటర్లు

ఏఐ స్కిల్స్ ఉన్న వ్యక్తులతో పాటు భారత్‌లో ఇప్పటికే ఉన్న పబ్లిక్ డిజిటల్ మౌలిక సదుపాయాలైన ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఓఎన్‌డీసీ వంటివి ఏఐ మార్కెట్‌ను మరింత ఊతమిస్తాయి. అత్యధిక స్మార్ట్‌ఫోన్ వాడకం ఉన్న జానాభా ద్వారా డేటా ఉత్పత్తి, ఏఐ మోడళ్లపై శిక్షణకు ప్రధాన ఇంధనంగా మారతాయి. వీటికి తోడు ఈ ఏడాది దేశంలో కొత్తగా 45 డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తాయి, తద్వారా ప్రస్తుత 152 సెంటర్లతో కలిపి 1,015 మెగావాట్ల డేటా సామర్థ్యం సొంతమవుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇండియాఏఐ కింద రూ. 10 వేల కోట్ల మూలధనంతో జాతీయ ఏఐ కంప్యూట్ ఇన్‌ఫ్రా ఏర్పాటవుతుంది. ఇది ఏఐ మోడల్ శిక్షణ, పరిశోధన కోసం 10 వేల కంటే ఎక్కువ జీపీయూలకు యాక్సెస్ లభిస్తుందని నివేదిక పేర్కొంది.

Next Story