Women in Business: స్వయం శక్తితో రూ. 2 లక్షల కోట్లు సంపాదించిన మహిళా వ్యాపారులు

by S Gopi |   (  Updated:2025-06-04 12:35:43  IST  )

వీరు సంయుక్తంగా రూ. 12 లక్షల కోట్లకు పైగా విలువైన కంపెనీలను నిర్వహిస్తున్నారు.

Women in Business: స్వయం శక్తితో రూ. 2 లక్షల కోట్లు సంపాదించిన మహిళా వ్యాపారులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లోని అత్యంత శక్తివంతమైన మహిళలు స్వయం శక్తితో రూ. 2 లక్షల కోట్లకు పైగా సంపద సృష్టించారని హురున్ ఇండియా వెల్లడించింది. వీరు సంయుక్తంగా రూ. 12 లక్షల కోట్లకు పైగా విలువైన కంపెనీలను నిర్వహిస్తున్నారు. 2025 కాండెర్ హురున్ ఇండియా ఉమన్ లీడర్స్ జాబితా బుధవారం విడుదలైంది. దీని ప్రకారం, వీరు ఆర్థికవ్యవస్థలో బిజినెస్, లీడర్‌షిప్, ఇన్‌ఫ్లుయెన్స్, ఇంపాక్ట్ వంటి అంశాల ఆధారంగా స్థానం సంపాదించుకున్నారని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, చీఫ్ రీసెర్చర్ ఆనాస్ రెహమాన్ జునైద్ అన్నారు. 2025 కాండెర్ హురున్ ఇండియా మహిళా లీడర్ల జాబితా ప్రకారం, పది మంది తొలి జనరేషన్ మహిళా సంపద సృష్టికర్తలు దాదాపు రూ. 2 లక్షల కోట్ల సంపద పోగుచేశారు. ప్రధానంగా సాఫ్ట్‌వేర్, హెల్త్‌కేర్, రిటైల్, ఆర్థిక సేవల రంగాలలో జీరోతో మొదలుపెట్టి బిలియన్ డాలర్ల వ్యాపారాలను నిర్మించారు.

జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకురాలు రాధా వెంబు రూ. 55,300 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ఆమె తర్వాత అమెరికాకు చెందిన అరిస్టా నెట్‌వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ ఉన్నారు. ఆమె సంపద రూ. 48,900 కోట్లుగా అంచనా వేశారు. టాప్-10 మహిళల్లో ఏడుగురు భారత్‌లోనే ఉండటం విశేషం. మిగిలిన ముగ్గురు అమెరికాకు చెందినవారు.

మహిళా వ్యాపారుల్లో సాఫ్ట్‌వేర్, సేవల రంగం ఆధిపత్యం కొనసాగిస్తోంది. మొత్తం సంపదలో రూ. 1.11 లక్షల కోట్లు ఈ రంగాలకు చెందిన మహిళల నుంచే ఉంది. జాబితాలో ఇతర పరిశ్రమలలో హెల్త్‌కేర్, రిటైల్, ఫైనాన్స్, టెక్స్‌టైల్స్, మీడియా ఉన్నాయి.

టాప్-10 తొలి తరం మహిళా సంపద సృష్టికర్తలు

1. రాధా వెంబు(52) రూ. 55,300 కోట్లు, జోహో కార్పొరేషన్, సాఫ్ట్‌వేర్ & సర్వీసెస్

2. జయశ్రీ ఉల్లాల్(63) రూ. 48,900 కోట్లు, శాంటా క్లారా, అరిస్టా నెట్‌వర్క్స్, సాఫ్ట్‌వేర్ & సర్వీసెస్

3. కిరణ్ మజుందార్-షా(71) రూ. 32,000 కోట్లు, బయోకాన్, హెల్త్‌కేర్

4. ఫల్గుణి నాయర్(61) రూ. 29,000 కోట్లు, నైకా, రిటైల్

5. నేహా నార్ఖేడే(41) రూ. 6,800 కోట్లు, కాన్‌ఫ్లూయెంట్, సాఫ్ట్‌వేర్ & సర్వీసెస్

6. కవితా సుబ్రమణియన్(43) రూ. 6,500 కోట్లు, అప్‌స్టాక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్

7. నేహా బన్సాల్(43) రూ. 5,100 కోట్లు, లెన్స్‌కార్ట్, రిటైల్

8. ఇంద్ర కె నూయి రూ. 4,800 కోట్లు, పెప్సికో (మాజీ సీఈఓ) ఫుడ్ అండ్ బేవరేజెస్

9. జూహి చావ్లా(57) రూ. 4,600 కోట్లు, నైట్ రైడర్స్, స్పోర్ట్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్

10. మీనా సేథి(80) రూ. 2,700 కోట్లు, ఓరియంట్ ఫ్యాషన్ ఎక్స్‌పోర్ట్స్, టెక్స్‌టైల్స్ & అప్పారెల్

Next Story