అమెరికాలో భారత పచ్చళ్ళ వ్యాపారం విలువ రూ. 20 వేల కోట్లు

by Muthe.Rajitha |   (  Updated:2025-08-08 15:57:41  IST  )

భారతదేశం సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిదారుగా మాత్రమే కాకుండా, అతిపెద్ద ఎగుమతిదారుగా కూడా నిలుస్తోంది.

అమెరికాలో భారత పచ్చళ్ళ వ్యాపారం విలువ రూ. 20 వేల కోట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశం సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిదారుగా మాత్రమే కాకుండా, అతిపెద్ద ఎగుమతిదారుగా కూడా నిలుస్తోంది. భారతదేశం ప్రతియేటా సుమారు రూ. 20,000 కోట్ల విలువైన పచ్చళ్ళు, పాపడ్‌లు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ముఖ్యంగా కెనడా, యుకె, అమెరికాలో ఈ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఉంది. 2023-24లో రూ. 36,958.80 కోట్ల విలువైన స్పైసెస్ ను ఎగుమతి చేయగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరునెలల్లోనే భారత్ రూ. 29,016 కోట్ల (US$ 3.36 బిలియన్) విలువైన సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసి రికార్డ్ నెలకొల్పింది. 2027 నాటికి 10 బిలియన్ డాలర్ల ఎగుమతిని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

వీటిలో ఒక్క అమెరికానే రూ. 5,136 కోట్ల (US$ 594.82 మిలియన్) విలువైన స్పైసెస్ ను దిగుమతి చేసుకోగా.. రూ. 2,766 కోట్ల (US$ 320.36 మిలియన్) విలువైన సుగంధ ద్రవ్యాలను యూకే దిగుమతి చేసుకుంది. అమెరికాలో వీటి డిమాండ్ ప్రతియేటా 10% పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా, కెనడా, యుకెలతో సహా అన్ని యూరప్ దేశాల్లో భారతీయ పచ్చళ్లకు, పాపడ్‌లకు డిమాండ్ ఎక్కువే. అక్కడి మార్టుల్లో ఇవి హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. చాలాసార్లు ఔట్ ఆఫ్ స్టాక్ బోర్డులు కూడా దర్శనం ఇస్తాయి. అయితే ఇందుకు గల ప్రధాన కారణం భారత్ నుంచి విదేశాలకు పెరుగుతున్న భారీ వలసలు అంటున్నారు నిపుణులు. అలాగే విదేశీయుల్లో భారతీయ రుచుల పట్ల ఆసక్తి, ఆరోగ్యకరమైన సేంద్రీయ ఆహార ఉత్పత్తుల పట్ల పెరుగుతున్న ఆదరణ కూడా కారణమే అంటున్నారు.

ఉదాహరణకు కెనడాలో భారతీయ రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలో మామిడి, నిమ్మ వంటి పచ్చళ్ళు, భారత్ నుంచి ఎగుమతయ్యే బియ్యం, పాపడ్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంది. అలాగే యుకెలో కూడా పచ్చళ్ళు, పాపడ్‌లు బ్రిటిష్-ఇండియన్ వంటకాలలో ప్రధాన భాగంగా మారాయి. భారత్ తన నిర్దిష్ట లక్ష్యాన్ని చేరాలంటే ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతులు ఉండటం, మార్కెట్ అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం ఇంకా ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story