Railways: ఫ్లైట్ జర్నీ తరహాలోనే లగేజీ పై రూల్స్ తీసుకురానున్న రైల్వే

by S Gopi |   (  Updated:2025-08-19 15:03:49  IST  )

పరిమితి మించి ఉండే లగేజీపై జరిమానాలు కూడా విధించవచ్చు.

Railways: ఫ్లైట్ జర్నీ తరహాలోనే లగేజీ పై రూల్స్ తీసుకురానున్న రైల్వే
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ రైల్వేలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన స్టేషన్లలో ప్రయాణీకుల కోసం విమానాశ్రయాల్లో ఉండే తరహాలో లగేజీకి సంబంధించి నియమాలను ప్రవేశపెట్టడానికి భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. త్వరలో, రైల్వే స్టేషన్లలో లగేజీ బరువును తూకం వేయనున్నారు. పరిమితి మించి ఉండే లగేజీపై జరిమానాలు కూడా విధించవచ్చు. ప్రయాణాలను సౌకర్యవంతమైన ప్రయాణం, ఓవర్‌లోడింగ్‌ను తగ్గించడం, రైల్వే వనరులను న్యాయంగా ఉపయోగించుకునేలా చూడటమే తాజా చర్యల లక్ష్యం. విమాన ప్రయాణాల్లో ఉండే నిబంధనల మాదిరిగానే ప్రయాణీకులు నిర్దేశించిన బరువులను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

రైల్వేలో లగేజీకి సంబంధించి నిబంధనలు ముందునుంచే ఉన్నాయి. ఒక్కో ప్రయాణికుడు క్లాస్‌ని బట్టి లగేజీకి పరిమితి ఉంది. కానీ, రైల్వే స్టేషన్లలో ఉన్నటువంటి మౌలిక సదుపాయలు ఇందుకు సరిపోక, నిబంధనలు అమలు కావట్లేదు. తాజా చర్యలతో ఇకపై లగేజీ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. మొదటి దశలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ నిబంధనలు అమలు చేస్తారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, ప్రయాణికులు స్టేషన్లలో ఉండే ఎలక్ట్రానిక్స్ వెయింగ్ మెషీన్లపై తమ లగేజీ ఉంచాలి. నిర్దేశించిన పరిమితి లేదా పరిమాణం దాటితే అదనపు ఛార్జీలు లేదా పెనాల్టీ విధించనున్నారు.

లగేజీ పరిమితి

రైల్లో ప్రయాణించే తరగతిని బట్టి లగేజీ ఛార్జీలు మారనున్నాయి. ఫస్ట్‌క్లాస్ ఏసీ వారికి గరిష్ఠంగా 70 కిలోల(అదనంగా 15 కిలోల సడలింపు ఉంటుంది) వరకు, ఏసీ టైర్-2లోని వారికి 50 కిలోలు(అదనంగా 10 కిలోల సడలింపు), ఏసీ టైర్-3, స్లీపర్ ప్రయాణికులకు 40 కిలోల(అదనంగా 10 కిలోల సడలింపు) వరకు లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతించనున్నారు. సెకండ్ క్లాస్‌లో ప్రయాణించే వారు 35 కిలోల(అదనంగా 10 కిలోల సడలింపు) వరకు తీసుకెళ్లవచ్చు. ఎవరైనా అదనపు లగేజీ తీసుకెళ్లాలంటే స్టేషన్లలో అరగంట ముందుగానే లగేజీ కౌంటర్ వద్ద అవసరమైన సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతించిన దానికంటే ఎక్కువ లగేజీ తీసుకెళ్తే ఉన్న లగేజీపై 1.5 రెట్ల జరిమానా విధించనున్నారు.

సింగిల్-బ్రాండ్ స్టోర్లు

అంతేకాకుండా, దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్ యాక్సెసరీస్ వంటి ఉత్పత్తులను విక్రయించే ప్రత్యేక స్టోర్ల ఏర్పాటుకు రైల్వే శాఖ అనుమతివ్వనుంది. ఇందులో భాగంగా స్టేషన్లలో ప్రీమియం సింగిల్-బ్రాండ్ స్టోర్లను ప్రారంభించనున్నారు. సింగిల్-బ్రాండ్ స్టోర్ అనేది ఒకే బ్రాండ్ లేదా కంపెనీ ఉత్పత్తులను విక్రయించే రిటైల్ ఔట్‌లెట్. ఇక్కడ నిర్దిష్ట బ్రాండ్‌కు చెందిన ఉత్పత్తులను విక్రయిస్తారు. ప్రీమియం సింగిల్-బ్రాండ్ స్టోర్‌ల ఏర్పాటు ద్వారా ప్రయాణీకులకు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడం, రైల్వే స్టేషన్లలో రిటైల్ షాపింగ్ వాతావరణాన్ని అందించడం లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story