Indian Companies: బ్రిటన్‌లో భారతీయ కంపెనీల జోరు

by S Gopi |

బ్రిటన్‌లో మన దేశానికి చెందిన కంపెనీల సంఖ్య కేవలం ఏడాదిలోనే దాదాపు 60 శాతం పెరిగి 1,197 నుంచి ఏకంగా 1,912కి చేరింది.

Indian Companies: బ్రిటన్‌లో భారతీయ కంపెనీల జోరు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బ్రిటన్ (యూకే) వ్యాపార రంగంలో భారతీయ కంపెనీలు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. ప్రముఖ గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ 'గ్రాంట్ థార్న్‌టన్' తన తాజా ‘ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్ 2026’ నివేదికలో ఈ వివరాలను బయటపెట్టింది. నివేదిక ప్రకారం.. బ్రిటన్‌లో మన దేశానికి చెందిన కంపెనీల సంఖ్య కేవలం ఏడాదిలోనే దాదాపు 60 శాతం పెరిగి 1,197 నుంచి ఏకంగా 1,912కి చేరింది. ఇక వీటి టర్నోవర్ విషయానికొస్తే.. 2025లో 72.14 బిలియన్ యూరో(రూ. 7.89 లక్షల కోట్లు)గా ఉన్న వ్యాపారం, 2026 నాటికి ఏకంగా 105.77 బిలియన్ యూరోలకు (సుమారు రూ. 11.5 లక్షల కోట్లకు) ఎగబాకింది. గతేడాది జూలైలో ఇరు దేశాల మధ్య జరిగిన చారిత్రాత్మక 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం' అమల్లోకి వచ్చిన ఏడాది లోపే ఈ రేంజ్ లో ఫలితాలు రావడం విశేషం. ఈ కంపెనీలు బ్రిటన్ ప్రభుత్వానికి భారీగా కార్పొరేట్ పన్నులు చెల్లించడమే కాకుండా, సగటున 61 శాతం వార్షిక ఆదాయ వృద్ధిని నమోదు చేస్తూ దూసుకుపోతున్నాయి.

రెండు లక్షల ఉద్యోగాలతో 'టాప్'లో టాటా

భారతీయ కంపెనీలు కేవలం లాభాలు సంపాదించడమే కాదు.. బ్రిటన్ నిరుద్యోగులకు కల్ప వృక్షంలా మారాయి. గతేడాదితో పోలిస్తే ఉపాధి కల్పనలో 60.6 శాతం వృద్ధిని సాధిస్తూ.. యూకే అంతటా ఏకంగా 2,03,549 మందికి మన కంపెనీలు ఉద్యోగాలిచ్చాయి. ఇందులో 44,000 మందికి పైగా ఉద్యోగులతో 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (టాటా మోటార్స్) బ్రిటన్‌లోనే అతిపెద్ద భారతీయ సంస్థగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో టాటా స్టీల్ (19,600 మంది), బొరెల్లీ టీ హోల్డింగ్స్ ఉన్నాయి. ఇందులో మరో ఆసక్తికరమైన మార్పు ఏంటంటే.. ఇప్పటివరకు భారతీయ వ్యాపారాలన్నీ కేవలం లండన్ నగరానికే పరిమితం కాగా, ఇప్పుడు లండన్ వాటా 38 శాతానికి తగ్గి.. మిడ్‌లాండ్స్, నార్త్ బ్రిటన్ లాంటి ఇతర ప్రాంతాలకు కూడా మన కంపెనీలు విస్తరిస్తున్నాయి. దీనివల్ల బ్రిటన్‌లోని అన్ని ప్రాంతాలకు భారతీయ పెట్టుబడులు, ఉద్యోగాలు చేరుతున్నాయి.

ఐటీ, ఫార్మా రంగాల ఆధిపత్యం

ఈ వ్యాపార విజయాల్లో ఎప్పటిలాగే టెక్నాలజీ, మీడియా, టెలికాం (టీఎంటీ) రంగాలు టాప్ గేర్‌లో దూసుకెళ్తుండగా, తయారీ, ఫార్మా రంగాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఎల్‌టిఐమైండ్‌ట్రీ, విప్రో, ప్రైమ్ ఫోకస్ (1,283 శాతం వృద్ధి), జైడస్ ఫార్మాస్యూటికల్స్ (320 శాతం) వంటి కంపెనీలు బ్రిటన్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. వీటితో పాటు కంపెనీల బోర్డు డైరెక్టర్లలో మహిళల వాటా కూడా 26 శాతానికి పెరిగి జెండర్ బ్యాలెన్స్ కూడా కొనసాగుతోంది.

Next Story