Indain money in Swiss Bank: స్విస్ బ్యాంకుల్లో మూడు రెట్లు పెరిగిన భారతీయుల సొమ్ము

by S Gopi |

ఇందులో ఎక్కువ భాగం బ్యాంకు ఛానెల్స్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చాయని ఎన్ఎన్‌బీ తెలిపింది.

Indain money in Swiss Bank: స్విస్ బ్యాంకుల్లో మూడు రెట్లు పెరిగిన భారతీయుల సొమ్ము
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్విస్‌బ్యాంకుల్లో భారతీయులు లేదా భారతీయ సంస్థలు చేసే డిపాజిట్లు భారీగా పెరిగాయి. గతేడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము మూడు రెట్లు పెరిగి 3.54 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (సుమారు రూ. 37,600 కోట్లు) చేరుకుందని స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్‌బీ) గురువారం వెల్లడించింది. ఇది 2021 తర్వాత అత్యధికం. ఇందులో ఎక్కువ భాగం వ్యక్తిగత కస్టమర్ ఖాతాల నుంచి కాకుండా బ్యాంకు ఛానెల్స్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చాయని ఎన్ఎన్‌బీ తెలిపింది. భారతీయ కస్టమర్ల నుంచి నేరుగా జరిగే డిపాజిట్లు కూడా స్వల్పంగా పెరిగాయి. ఇవి 11 శాతం వృద్ధితో 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (సుమారు రూ. 3,675 కోట్లు) చేరుకున్నాయి. ఈ డిపాజిట్లు మొత్తం భారతీయులతో సంబంధం ఉన్న నిధులలో పదో వంతు మాత్రమే. ఎస్ఎన్‌బీ ప్రకారం, మొత్తం రూ. 37,600 కోట్లలో ఇతర బ్యాంకుల ద్వారా రూ. 32 వేల కోట్లు, కస్టమర్ ఖాతాలలో రూ. 3,670 కోట్లు, ట్రస్టుల ద్వారా రూ. 435 కోట్లు, బాండ్లు, సెక్యూరిటీల వంటి ఇతర సాధనాలలో రూ. 1,432 కోట్లు ఉన్నాయి.

అయితే, 2023లో స్విస్ బ్యాంకుల్లో మన వాళ్ల సొమ్ము 70 శాతం తగ్గింది. ఇది నాలుగేళ్ల కనిష్టం సుమారు రూ. 11 వేల కోట్లకు చేరుకున్నాయి. కాబట్టి తాజాగా పెరుగుదల చాలా ఎక్కువగా పరిగణించవచ్చు. అయితే, 2006లో ఉన్న దాదాపు రూ. 70 వేల కోట్ల ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి కంటే ప్రస్తుతం చాలా తక్కువ మొత్తం స్విస్ బ్యాంకుల్లో మనవాళ్ల సొమ్ము ఉంది. ఇవన్నీ స్విట్జర్లాండ్‌ నేషనల్‌ బ్యాంక్‌(ఎస్‌ఎన్‌బీ)కు అక్కడి బ్యాంకులు ఇచ్చిన అధికారిక గణాంకాలు మాత్రమే. భారతీయులు దాచి ఉంటారని భావించే నల్లధనం వివరాలు ఇందులో లేవు. భారతీయులు, ఇతర దేశాల సంస్థల పేర్లతో చేసిన డిపాజిట్లు కూడా వెల్లడించరు.

ప్రపంచవ్యాప్తంగా 48వ ర్యాంక్

స్విస్ బ్యాంకుల్లో నిధుల పరంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా 48వ స్థానానికి చేరుకుంది. గత సంవత్సరం 67వ స్థానంలో ఉంది. అయితే, ఇది 2022 చివరి నాటికి ఉన్న 46వ ర్యాంక్ కంటే ఇప్పుడు తక్కువగా ఉంది. ఇతర దేశాలకు సంబంధించి పాకిస్తాన్ 272 మిలియన్ స్విస్‌ ఫ్రాంక్‌ (సీహెచ్‌ఎఫ్‌)లకు పడిపోయింది. బంగ్లాదేశ్ నిధులు (589 మిలియన్ సీహెచ్‌ఎఫ్‌)కు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో 222 బిలియన్ సీహెచ్ఎఫ్‌లతో యూకే అగ్రస్థానంలో ఉంది. అమెరికా(89 బిలియన్ సీహెచ్‌ఎఫ్‌), వెస్టిండీస్ (68 బిలియన్ సీహెచ్‌ఎఫ్‌) ఉన్నాయి. వీటి తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, హాంకాంగ్, లగ్జెంబర్గ్, సింగపూర్, గుర్న్‌సే, యూఏఈ టాప్ 10లో ఉన్నాయి.

Next Story