Indian Jewellery,: ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్‌పై భారతీయ ఆభరణాల వ్యాపారుల ఆందోళన

by S Gopi |

ముఖ్యంగా భారత ఎగుమతులకు కీలకమైన బంగారు ఆభరణాలు, వజ్రాల విభాగంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని వ్యాపారులు తెలిపారు.

Indian Jewellery,: ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్‌పై భారతీయ ఆభరణాల వ్యాపారుల ఆందోళన
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై రివేంజ్ టారిఫ్ విధించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో దేశీయ రత్నాభరణాల పరిశ్రమ వర్గాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ బంగారు ఆభరణాలపై పన్నులు పెంచితే ఎగుమతులు భారీగా దెబ్బతినవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. భారతీయ ఆభరణాల ఎగుమతుల్లో కట్ అండ్ పాలిస్ వజ్రాలు, పొదిగిన బంగారు ఆభరణాలు, సాదా బంగారం, ల్యాబ్‌లో తయారైన వజ్రాలు, వెండి ఆభరణాలపై ప్రభావం ఉండనుంది. మరీ ముఖ్యంగా భారత ఎగుమతులకు కీలకమైన బంగారు ఆభరణాలు, వజ్రాల విభాగంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని వ్యాపారులు తెలిపారు. పరిశ్రమ వర్గాల ప్రకారం, అమెరికా నుంచి వచ్చే బంగారు ఆభరణాలాపై భారత ప్రభుత్వం 20 శాతం సుంకం విధిస్తుండగా, భారత ఆభరణాలపై అమెరికా 5.5 శాతం నుంచి 7 శాతం వరకు పన్నులు అమలు చేస్తోంది. ఇదే సమయంలో భారత్ కట్ అండ్ పాలిష్ వజ్రాలపై 5 శాతం సుంకం వసూలు చేస్తోంది. కానీ, భారత్ నుంచి వెళ్లే ఇవే ఉత్పత్తులపై అమెరికా ఎలాంటి సుంకం విధించడంలేదు.

తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ తరహాలోనే అమెరికా టారిఫ్ విధించాలని భావిస్తే దేశీయ రత్నాభరణాల పరిశ్రంలో ఉపాధి పొందుతున్న 2 లక్షల మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యాపారులు వివరించారు. ఇప్పటికే గత కొన్నేళ్ల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక అనిశ్చితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-గాజా వివాదం, ఇతర భౌగోళిక రాజకీయ పరిణామాలతో అమెరికా, చైనాలకు భారత సహజ వజ్రాల ఎగుమతులు క్షీణించాయి. ఈ సమయంలో అమెరికా పన్నుల నిర్ణయం పరిశ్రమను ఎక్కువ దెబ్బతీయవచ్చు. దీని పరిష్కారానికి పరిశ్రమ వర్గాలు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు వినతులు సమర్పించారు. రెసిప్రోకల్ టారిఫ్ వల్ల ఎదురయ్యే నష్టాలను మంత్రికి వివరించారు. రత్నాభరణాల పరిశ్రమను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story