- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: చైనాతో పోలిస్తే భారతీయ కంపెనీలకు తక్కువ ప్రభుత్వ మద్దతు
2005 నుంచి 2024 మధ్య కాలంలో చైనా సంస్థలు, అభివృద్ధి చెందిన దేశాల కంపెనీలతో పోలిస్తే సగటున మూడు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రభుత్వ సబ్సిడీలు పొందాయని నివేదిక పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ తయారీ రంగంలో చైనా కంపెనీలు సాధించిన ఆధిపత్యం వెనుక ఆ దేశ ప్రభుత్వ మద్దతు కీలక పాత్ర పోషించిందని ఓఈసీడీ తాజా నివేదిక వెల్లడించింది. 2005 నుంచి 2024 మధ్య కాలంలో చైనా సంస్థలు, అభివృద్ధి చెందిన దేశాల కంపెనీలతో పోలిస్తే సగటున మూడు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రభుత్వ సబ్సిడీలు పొందాయని నివేదిక పేర్కొంది. అదే సమయంలో భారత్, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాల సంస్థలకు లభించిన మద్దతుతో పోలిస్తే కూడా చైనా కంపెనీలకు అందిన ప్రోత్సాహకాలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. గ్రాంట్లు, పన్ను రాయితీలు, తక్కువ వడ్డీ రుణాల రూపంలో ఈ సబ్సిడీలు అందినట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా, 2005-2023 మధ్య ప్రపంచ మార్కెట్‌లో కంపెనీలు సాధించిన వాటా పెరుగుదలలో సుమారు 22 శాతం ప్రభుత్వ సబ్సిడీల ప్రభావమేనని నివేదిక అంచనా వేసింది. చైనా సంస్థల విషయంలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించిందని, వాటి మార్కెట్ వాటా పెరుగుదలలో దాదాపు 60 శాతం వరకు ప్రభుత్వ మద్దతు కారణమైందని పేర్కొంది. ప్రపంచంలోని 15 కీలక తయారీ రంగాల్లోని 525 అతిపెద్ద కంపెనీల డేటాను విశ్లేషించి ఓఈసీడీ ఈ నివేదిక రూపొందించింది. ఇదే సమయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో సబ్సిడీల వివరాలను వెల్లడించని సభ్య దేశాల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఓఈసీడీ హెచ్చరించింది. 1995లో 23 శాతంగా ఉన్న ఈ సంఖ్య 2025 నాటికి 70 శాతానికి చేరుకోవడం ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని నివేదిక స్పష్టం చేసింది.






