India: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో భారత ఎగుమతిదారులకు ప్రయోజనం

by S Gopi |

అగ్రరాజ్యం, డ్రాగన్ దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా ఆయా దేశాల్లో కొన్ని రకాల ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి.

India: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో భారత ఎగుమతిదారులకు ప్రయోజనం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాపై పన్నులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి బదులుగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై అమెరికా కంటే ఎక్కువ పన్నులను విధిస్తూ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం, డ్రాగన్ దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా ఆయా దేశాల్లో కొన్ని రకాల ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. అయితే, ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా భారత్ నుంచి అమెరికాకు పంపే ఎగుమతిదారులకు ప్రయోజనం ఉండనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో అమెరికా మార్కెట్‌కు ఎగుమతులను పెంచుకోవడం ద్వారా లాభపడొచ్చు. గతంలో సైతం మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన సమయంలో చైనాపై పన్నులు వేశారు. అప్పుడు కూడా ఆ నిర్ణయంతో లాభపడిన దేశాల్లో భారత్ ఉందనే విషయాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

చైనా నుంచి దిగుమతులపై అమెరికా కస్టమ్స్ సుంకాలు విధించడం వల్ల అమెరికాకు ఎగుమతి చేసే అవకాశాలు భారత్‌కు భారీగా ఉన్నాయి. సుంకం పెంపు నిర్ణయం చైనా నుంచి యుఎస్‌కి జరిగే ఎగుమతులపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే ట్రంప్ నిర్ణయంతో అమెరికన్ మార్కెట్లో చైనా తన ఉత్పత్తుల ధరలను పెంచనుంది. తద్వారా అమెరికా ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. దీనివల్ల భారత ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయి. అందులో ముఖ్యమైన ఎలక్ట్రికల్ మెషినరీ అండ్ కాంపొనెంట్స్, ఆటో కాంపొనెంట్స్, మొబైల్, కెమికల్స్, ఫార్మా, టెక్స్‌టైల్స్, ఫ్యాబ్రిక్ వంటి రంగాలు ఎక్కువ లాభపడనున్నాయి. కానీ, భారత్‌లో జరిగే ఉత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ప్రయోజనాలు ఉంటాయని అజయ్ సహాయ్ అభిప్రాయపడ్డారు. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు ఏప్రిల్-నవంబర్ మధ్య 82.52 బిలియన్ డాలర్లతో రెండో విలువైన ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామిగా అమెరికా ఉంది. అంతేకాకుండా 2021 నుంచి 2024 మధ్య భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.

Next Story