Consumer Spending: భారతీయుల 'స్మార్ట్ స్పెండింగ్'

by S Gopi |

నిత్యావసరాలకు ప్రాధాన్యత ఇస్తూనే, పెద్ద, అనవసర కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

Consumer Spending: భారతీయుల స్మార్ట్ స్పెండింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వినియోగదారుల ఖర్చు ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఇప్పుడు ఖర్చు చేసే ముందు ఎక్కువ ఆలోచిస్తున్నారు. డెలాయిట్ విడుదల చేసిన ‘కన్స్యూమర్ సిగ్నల్స్ ఇండియా’ తాజా నివేదిక ప్రకారం, దేశంలోని కుటుంబాలు ఖర్చును పూర్తిగా తగ్గించడం లేదు కానీ 'స్మార్ట్ స్పెండింగ్' అనే విధానాన్ని అవలంబిస్తున్నాయి. నిత్యావసరాలకు ప్రాధాన్యత ఇస్తూనే, పెద్ద, అనవసర కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

చాలామంది ఇప్పుడు ధర మాత్రమే కాకుండా, నాణ్యత, నమ్మకం, దీర్ఘకాల ప్రయోజనం వంటి అంశాలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఆహారం విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. చాలా కుటుంబాలు కిరాణా ఖర్చులను సాధ్యమైనంత వరకు నియంత్రిస్తున్నప్పటికీ, నాణ్యత విషయంలో రాజీ పడటం లేదు. వృథాను తగ్గించడం, స్టోర్ బ్రాండ్‌లను ఎంచుకోవడం, బడ్జెట్‌ను మరింత సమర్థంగా వాడుకోవడం వంటి అలవాట్లు పెరుగుతున్నాయి. 31 శాతం మంది వినియోగదారులు ఆహార వ్యర్థాలను తగ్గిస్తుండగా, చాలా కుటుంబాలు కేవలం చౌకగా ఉందని ఏది పడితే అది కొనడం కాదు.. డబ్బుకు సరైన విలువ వచ్చే వస్తువులనే ఎంచుకుంటున్నారు

బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే ఖర్చు

ప్రయాణ, ఆతిథ్య రంగంలోనూ వినియోగదారుల ప్రవర్తన ఆసక్తికరంగా మారుతోంది. ప్రయాణించే వారి సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ప్రయాణం చేసే వారు మాత్రం మెరుగైన సౌకర్యాన్ని కోరుకుంటున్నారు. ఫుల్-సర్వీస్ ఎయిర్‌లైన్స్, ప్రీమియం సీట్లు, ఉన్నత స్థాయి హోటళ్లు వంటి ఆప్షన్లపై ఆసక్తి పెరుగుతోంది. అంటే, వినియోగదారులు ఎక్కువసార్లు ఖర్చు చేయడం కంటే, తక్కువసార్లు అయినా మెరుగైన ఎక్స్‌పీరియన్స్ కోసం ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ట్రెండ్ ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి, అధిక ఆదాయ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

వాహనాలకు సంబంధించి ఈ జాగ్రత్త మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఉద్దేశం తగ్గినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి మాత్రం నిలకడగా ఉంది. చాలా మంది తమ వద్ద ఉన్న ప్రస్తుత వాహనమే అవసరాలకు సరిపోతుందని భావిస్తూ పెద్ద ఖర్చులను వాయిదా వేస్తున్నారు. కానీ ఈవీల విషయంలో మాత్రం తక్కువ నిర్వహణ ఖర్చులు, టెక్ ఫీచర్లు, పర్యావరణ అనుకూలత వంటి అంశాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, భారతీయ వినియోగదారులు ఇప్పుడు తమకున్న కోరికలను పూర్తిగా వదిలేయకుండా, ఆర్థిక క్రమశిక్షణతో సమతుల్యం చేసుకుంటూ మరింత తెలివిగా ఖర్చు చేస్తున్నారని నివేదిక స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా జీవన ప్రమాణాలను మెరుగుపరచే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంత ఖర్చు చేశాం? అన్న దానికంటే ఎక్కడ ఖర్చు చేశాం? అన్న దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

Next Story