- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరికొత్త చరిత్ర సృష్టించిన భారత బ్యాంకులు.. 15 రోజుల్లోనే రూ.7 లక్షల కోట్ల డిపాజిట్లు
భారత బ్యాంకింగ్ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత బ్యాంకింగ్ రంగ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా డిపాజిట్లు వెల్లువెత్తాయి. దేశంలోని వాణిజ్య బ్యాంకుల్లో కేవలం 2 వారాల వ్యవధిలోనే ఏకంగా 7 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చి చేరాయి. జూన్ 26తో ముగిసిన 15 రోజులకు సంబంధించిన గణాంకాలను తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank Of India) విడుదల చేసింది. గత 29 సంవత్సరాల బ్యాంకింగ్ చరిత్రలో కేవలం 15 రోజుల్లో ఈ స్థాయిలో భారీగా డిపాజిట్లు రావడం ఇది మూడో అత్యధిక రికార్డు కావడం విశేషమని అధకారులు వెల్డించారు.
ఆర్థిక నిపుణులు విస్మయం..
అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా డేటా ప్రకారం దేశంలోని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల మొత్తం డిపాజిట్ల విలువ రికార్డు స్థాయిలో రూ.219.78 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకుముందు 15 రోజులతో పోలిస్తే ఏకంగా 3.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెల చివరి వారాల్లో, బ్యాంకుల విలీనం జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి భారీ మార్పులు కనిపిస్తాయి. కానీ ఏప్రిల్-జూన్ త్రైమాసికం చివర్లో డిపాజిట్లలో ఈ స్థాయి వృద్ధి నమోదు కావడం ఆర్థిక నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
డిపాజిట్లకు తోడుగా పెరిగిన రుణాలు
ఇక కేవలం డిపాజిట్లే కాకుండా, ఇదే 15 రోజుల వ్యవధిలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల (Bank Credit) పరిమాణం కూడా భారీగా పెరిగింది. బ్యాంక్ క్రెడిట్ ఏకంగా రూ.3.25 లక్షల కోట్లు మేర పెరిగి మొత్తం రూ.171.43 లక్షల కోట్లకు చేరింది. అయితే డిపాజిట్ల వృద్ధి రేటు 3.3 శాతంతో పోలిస్తే రుణాల వృద్ధి రేటు 1.9శాతం కంటే తక్కువనే ఉంది. గత కొంతకాలంగా బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్లు తగ్గి, రుణాలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఈ సరికొత్త రికార్డు బ్యాంకులకు మంచి ఊపునిస్తోంది.
రికార్డు వెనుక అసలు కారణాలు..
డిపాజిట్లు రికార్డు స్థాయిలో పెరగడానికి గల కారణాలను బ్యాంకింగ్ రంగ నిపుణుల విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది. జూన్ త్రైమాసికం ముగింపు (Quarter-end window) కావడంతో కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు తమ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, క్వార్టర్-ఎండ్ విండో డ్రెస్సింగ్ కోసం పెద్ద ఎత్తున నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేశాయి. అందువల్లే కేవలం 15 రోజుల్లోనే రూ.7 లక్షల కోట్ల మేర భారీ డిపాజిట్లు నమోదయ్యాయని చెబుతున్నారు. ఈ చారిత్రాత్మక వృద్ధితో దేశీయ మార్కెట్లలో నగదు లభ్యత సమస్యలు పూర్తిగా తొలిగిపోతాయని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు.






