WPI Inflation: పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

by S Gopi |

గడిచిన రెండు నెలలుగా ప్రతికూలంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం, గత నెలలో మళ్లీ సానుకూలంగా మారింది.

WPI Inflation: పెరిగిన టోకు ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆహార పదార్థాలు, తయారీ వస్తువుల ధరలు ఖరీదైన కారణంగా టోకు ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, గతేడాది డిసెంబర్‌లో టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 0.83 శాతంగా నమోదైంది. గడిచిన రెండు నెలలుగా ప్రతికూలంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం, గత నెలలో మళ్లీ సానుకూలంగా మారింది. అంతకుముందు నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం -0.32 శాతం, 2024 డిసెంబర్‌లో 2.57 శాతంగా ఉంది. సమీక్షించిన నెలలో ద్రవ్యోల్బణం సానుకూల రేటుకు ప్రధాన కారణం ఉత్పాదక రంగాలు, ఖనిజాలు, యంత్రాలు, పరికరాల తయారీ, ఆహార ఉత్పత్తులు, టెక్స్‌టైల్స్ తయారీతో పాటు ఇతర రంగాల ధరలలో పెరుగుదల అని మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ నెలలో ఆహార ఉత్పత్తుల ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో నవంబర్‌లో -2.60 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ రేటు డిసెంబర్‌లో 0 శాతానికి చేరింది. డిసెంబర్ నెలలో పాలు, గుడ్లు, మాంసం, చేపలు, పండ్ల ధరలు కూడా పెరిగాయి.

అయితే, కూరగాయలు (-3.50 శాతం), పప్పుధాన్యాలు (-13.88 శాతం), గోధుమల (-1.58 శాతం) ధరలలో తగ్గుదల కనిపించింది. ఉల్లిపాయలు, బంగాళదుంపల ధరలు వరుసగా 54.40 శాతం, 38.21 శాతం క్షీణించాయి.

ఇంధనం, విద్యుత్, తయారీ ఉత్పత్తులు

డిసెంబర్‌లో ఇంధనం, విద్యుత్ ధరలు కూడా పెరిగాయి. బొగ్గు, ఖనిజ చమురు ధరల పెరుగుదలతో పాటు, అధిక విద్యుత్ ధరలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. మరోవైపు, డిసెంబర్‌లో తయారీ ఉత్పత్తుల ధరలు స్వల్పంగా పెరిగాయి. ముఖ్యంగా లోహాలు, రసాయనాలు, వస్త్రాలు, ఇతర తయారీ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. రబ్బరు, ప్లాస్టిక్ వస్తువులు, ఆహార ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, కాగితపు ఉత్పత్తులు, పానీయాలతో సహా ఇతర విభాగాల్లో ధరలు తగ్గాయని గణాంకాలు వెల్లడించాయి.

Next Story