India-UK: ఖరారైన భారత్, యూకే వాణిజ్య ఒప్పందం

by S Gopi |

పరస్పరం ప్రయోజజనం అందించే ఈ ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక పెట్టుబడులు పెరగనున్నాయి.

India-UK: ఖరారైన భారత్, యూకే వాణిజ్య ఒప్పందం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, యూకే దేశాల మధ్య ప్రతిష్టాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ ఒప్పందంపై ఎట్టకేలకు అవగాహన కుదిరిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది చారిత్రాత్మక ఒప్పందమని అభివర్ణించారు. పరస్పరం ప్రయోజనం అందించే ఈ ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక పెట్టుబడులు పెరగనున్నాయి. వివిధ రంగాలలో వృద్ధి, ఉద్యోగాల సృష్టి, వాణిజ్యం పెరుగుతుంది. ఈ ఒప్పందం రెండు దేశాల దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించినట్టు మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. త్వరలో బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్‌ను భారత్‌కు ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. గడిచిన మూడేళ్లుగా సాగుతున్న ఈ ఒప్పందంతో వాణిజ్యంపై ఆంక్షలు తొలగడం, స్వేచ్ఛా మార్కెట్ ద్వారా 2030 నాటికి రెండు దేశాల వాణిజ్యం 120 బిలియన్ డాలర్ల(రూ. 10 లక్షల కోట్ల)కు రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ఒప్పందంలో భాగంగా మన దేశం నుంచి తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి శ్రమతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అదే సమయంలో బ్రిటన్ నుంచి విస్కీ, కార్ల దిగుమతులు చౌకగా జరుగుతాయి. ఈ ఒప్పందం యూకే మార్కెట్లో 99 శాతం భారతీయ వస్తువులపై సుంకాలు సున్నాకు తగ్గుతాయి. ఇదే సమయంలో భారతీయ ఉద్యోగులు బ్రిటన్ పాయింట్-బేస్డ్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌ను మార్చకుండా పని కోసం యూకేకి ప్రయాణించడానికి వీలుంటుంది.

Next Story