IRFC: ఐఆర్ఎఫ్‌సీలో 4 శాతం వాటాను విక్రయిస్తున్న కేంద్రం

by S Gopi |

వాటా అమ్మకానికి సంబంధించి ఓఎఫ్ఎస్ ప్రక్రియ బుధవారం(ఫిబ్రవరి 25) ప్రారంభమవుతుంది.

IRFC: ఐఆర్ఎఫ్‌సీలో 4 శాతం వాటాను విక్రయిస్తున్న కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ)లో 4 శాతం వాటాను విక్రయిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం, భారత రైల్వేలకు ఫైనాన్సింగ్ విభాగంగా ఉన్న ఈ కంపెనీలో ప్రభుత్వానికి 86.36 శాతం వాటా ఉంది. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) కార్యదర్శి అరుణిష్ చావ్లా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. వాటా అమ్మకానికి సంబంధించి ఓఎఫ్ఎస్ ప్రక్రియ బుధవారం(ఫిబ్రవరి 25) ప్రారంభమవుతుంది. ప్రభుత్వం మొదట 2 శాతం వాటాను విక్రయిస్తుంది. పెట్టుబడిదారుల నుంచి లభించే డిమాండ్ ఆధారంగా మరో 2 శాతం విక్రయించవచ్చని అరుణిష్ చావ్లా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో అమ్మకానికి ఉంచిన వాటాను ఒక్కో షేరుకు రూ. 104 ఫ్లోర్ ధరను నిర్ణయించారు. ఇది మంగళవారం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి ఉన్న ధర కంటే 5 శాతం కంటే డిస్కౌంట్‌కు లభిస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఈ తగ్గింపు ఇచ్చినట్టు తెలుస్తోంది. నాన్-రిటైల్ పెట్టుబడిదారులకు ఫిబ్రవరి 25న బిడ్డింగ్ ప్రారంభం కానుండగా, రిటైల్ ఇన్వెస్టర్లకు ఫిబ్రవరి 26న బిడ్డింగ్ మొదలవుతుంది. దీనర్థం పెద్ద సంస్థలు, చిన్న మదుపర్లు ఇద్దరూ షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో, ప్రభుత్వం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో 5 శాతం వాటాను విక్రయించి రూ. 4 వేల కోట్లకు పైగా సేకరించింది. ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా రూ. 13,200 కోట్లను సేకరించింది.

Next Story