Economy: వచ్చే ఏడాది అంచనాలకు మించి భారత్ వృద్ధి: గోల్డ్‌మన్ శాక్స్

by S Gopi |

2026లో దేశ ఆర్థికవ్యవస్థ 6.7 శాతం పుంజుకోగలదని, 2027లో 6.8 శాతం మేర వృద్ధి సాధిస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది

Economy: వచ్చే ఏడాది అంచనాలకు మించి భారత్ వృద్ధి: గోల్డ్‌మన్ శాక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాదిలోనూ భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా కొనసాగుతుందని, అంచనాలకు మించి పుంజుకోగలదని ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంకు గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. బుధవారం సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశీయంగా గిరాకీ పటిష్టంగా ఉండటం, రోడ్లు, ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం స్థిరంగా కొనసాగడం, చైనా లాంటి దేశాలతో పోలిస్తే ఎగుమతులపై తక్కువగా ఆధారపడటం వంటి అంశాలు భారత వృద్ధికి దోహదపడుతున్నాయి. ఫలితంగా 2026లో దేశ ఆర్థికవ్యవస్థ 6.7 శాతం పుంజుకోగలదని, 2027లో 6.8 శాతం మేర వృద్ధి సాధిస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. దీనివల్ల ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని పేర్కొంది. ఇక, 2026 చివరి నాటికి చాలా దేశాలలో ద్రవ్యోల్బణం నెమ్మదిస్తుందని కూడా నివేదిక అభిప్రాయపడింది. దీనివల్ల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తక్కువగా ఉంచడానికి వీలు ఉంటుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా సంపన్న దేశాలలో ఉద్యోగ కల్పన నెమ్మదిస్తోందని గోల్డ్‌మన్స్ శాక్స్ హెచ్చరించింది. అయితే, స్థిరమైన వృద్ధి, సానుకూల ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత్‌ను గోల్డ్‌మన్ సాక్స్ ప్రపంచ ఆర్థికవ్యవస్థలో ఒక ఆశాకిరణంగా పేర్కొంది.

Next Story