India-UK: యూకే కార్లకు భారత్ మార్కెట్ ఓపెన్

by S Gopi |   (  Updated:2026-06-18 14:22:08  IST  )

మొదటి 15 ఏళ్లలో భారత్ మొత్తం 3.78 లక్షల వరకు సంప్రదాయ ఇంజిన్ కార్ల దిగుమతికి అనుమతి ఇవ్వనుంది.

India-UK: యూకే కార్లకు భారత్ మార్కెట్ ఓపెన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. జూలై 15 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. బుధవారం విడుదల చేసిన ఇండియా-యూకే సీఈటీఏ డాక్యుమెంట్ ప్రకారం, నిర్ణయించిన కోటాలో యూకే నుంచి దిగుమతి అయ్యే ప్యాసింజర్ కార్లపై ప్రస్తుతం ఉన్న సుమారు 110 శాతం దిగుమతి సుంకం క్రమంగా 10 శాతానికి తగ్గనుంది. మొదటి 15 ఏళ్లలో భారత్ మొత్తం 3.78 లక్షల వరకు సంప్రదాయ ఇంజిన్ కార్ల దిగుమతికి అనుమతి ఇవ్వనుంది. తొలి ఏడాదిలో 20,000 కార్లకు కోటా ఉండగా, తర్వాతి సంవత్సరాల్లో అది క్రమంగా పెరుగుతుంది. దీంతో జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి బ్రిటిష్ బ్రాండ్ల వాహనాలు భారత మార్కెట్లో మరింత పోటీ ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు, ఈ ఒప్పందం భారత ఆటో కంపెనీలకు కూడా కొత్త అవకాశాలు తెరుస్తోంది. ముఖ్యంగా టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకి వంటి సంస్థలకు యూకే మార్కెట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ వాహనాల ఎగుమతులను పెంచుకునే అవకాశం లభిస్తుంది. అయితే దేశీయ ఆటో పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ వాహన విభాగానికి పూర్తి రక్షణ కల్పించింది. 40,000 యూరోల కంటే తక్కువ ధర ఉన్న ఈవీలకు ఎలాంటి సుంక రాయితీలు ఇవ్వలేదు. దీంతో దేశీయ తయారీదారులు పెరుగుతున్న ఈవీ మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు.

Next Story