India: టారిఫ్ తాత్కాలిక విరామంతో వాణిజ్య ఒప్పందం కోసం త్వరపడుతున్న కేంద్రం

by S Gopi |

ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య ఒప్పందం మొదటి దశను అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

India: టారిఫ్ తాత్కాలిక విరామంతో వాణిజ్య ఒప్పందం కోసం త్వరపడుతున్న కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై త్వరపడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చైనాపై సుంకాలను పెంచుతూ, ఇతర దేశాలపై పరస్పర సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలిక వాయిదా వేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య ఒప్పందం మొదటి దశను అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. పరస్పర సుంకాలపై 90 రోజుల తాత్కాలిక విరామం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు, ముఖ్యంగా రొయ్యల ఎగుమతిదారులకు ఉపశమనం కలిగిస్తుందని అధికారి తెలిపారు.

మరోవైపు, వ్యవసాయం, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి దేశీయ రంగాలకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, అమెరికాతో సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) గురించి చర్చలు జరపడంపై భారత్ పునరాలోచించాలని జీటీఆర్ఐ గురువారం తెలిపింది. దేశీయంగా రైతుల కనీస మద్దతు ధరల వ్యవస్థను బలహీనపరచడం, జన్యుపరంగా మార్పు చెందిన ఆహార దిగుమతులను అనుమతించడం, వ్యవసాయ సుంకాలను తగ్గించడం, ఔషధ గుత్తాధిపత్యాన్ని పెంచేందుకు పేటెంట్ చట్టాలను మార్చడం, అమెరికాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజాలు నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి అనుమతించడం వంటివి అమెరికా నుంచి వినిపిస్తున్న డిమాండ్లలో ఉన్నాయి.

వీటిని అంగీకరిస్తే రైతుల ఆదాయాలకు గండి కొట్టినట్టు అవుతుందని, ఆహార భద్రత, జీవవైవిధ్యం, ప్రజారోగ్యం, చిన్న వ్యాపారుల మనుగడకు హాని కలుగుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) అభిప్రాయపడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా ఒత్తిళ్లకు లొంగవద్దని, భారత్‌కు నష్టం చేకూర్చే స్థాయిలో రాయితీలు పొందేందుకు అమెరికా బలవంతం చేయవచ్చని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. అమెరికాతో జరిగే ఈ ఒప్పందం భారత్‌కు లాభాల కంటే ఎక్కువ ఖర్చులు చేయించగలిగేదని తెలిపింది. అమెరికాకు ఏకపక్షంగా రాయితీలను ఇవ్వడం కాకుండా 90 శాతం పారిశ్రామిక వస్తువులపై యూరప్-అమెరికా మధ్య జరిగిన ఒప్పందం తరహాలో సున్నాకు సున్నా ఒప్పందం చేసుకోవాలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. కార్ల వంటి ఉత్పత్తులను మినహాయించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Next Story