- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crude Imports: మధ్యప్రాచ్యం గొడవలతో రష్యా, యూఎస్ చమురు దిగుమతులు పెంచిన భారత్
మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్ చేసుకునే చమురు దిగుమతుల కంటే ఎక్కువగా రష్యా, అమెరికాల నుంచి భారత్ కొనుగోలు చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, ఇజ్రాయెల్‌తో తగువు ముదురుతుండటంతో ప్రపంచ సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయాలను మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇటీవల రష్యా, అమెరికాల నుంచి ముడి చమురు దిగుమతులను పెంచింది. ప్రపంచ వాణిజ్య పరిశోధనా సంస్థ కెప్లర్ డేటా ప్రకారం, ఇటీవలి గణాంకాల్లో మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్ చేసుకునే చమురు దిగుమతుల కంటే ఎక్కువగా రష్యా, అమెరికాల నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఈ నెలలో భారత రిఫైనరీ సంస్థలు రోజుకు 20-22 లక్షల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును చేసుకుంటున్నాయి. ఇది గత రెండేళ్లలోనే అత్యధికం. అంతేకాకుండా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ల నుంచి సంయుక్తంగా దిగుమతి చేసుకునే 20 లక్షల బ్యారెళ్ల కంటే అధికం. అంతకుముందు నెలలో రష్యా నుంచి భారత్ 19.6 లక్షలా బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఇదే సమయంలో అమెరికా నుంచి మే నెలలో 2.8 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకున్న భారత్, ప్రస్తుత నెలలో దీన్ని 4.39 లక్షలకు పెంచుకుంది. జూన్ 1-19వ తేదీల మధ్య భారత్‌కు రష్యా ఎగుమతులు 35 శాతం పెరిగాయని కెప్లర్‌కు చెందిన నిపుణులు సుమిత్ రిటోలియా చెప్పారు.
రష్యా నుంచి మరింత కొనుగోలు అవకాశాలు
తాజాగా ఇజ్రాయెల్-ఇరాన్ వ్యవహారంలోకి అమెరికాకు నేరుగా జోక్యం చేసుకోవడంతో హార్ముజ్ జలసంధికి సంబంధించి ఏదైనా అంతరాయం ఏర్పడితే, రష్యన్ చమురు వాటా మరింత పెరుగుతుంది. భారత నిర్ణయంతో భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల లభ్యత, అధిక చమురు ధరల నుంచి ఉపశమనం లభిస్తుంది. రానున్న రోజుల్లో అధిక సరుకు రవాణా ఖర్చులను అధిగమించేందుకు మనదేశం యుఎస్, నైజీరియా, అంగోలా, బ్రెజిల్ వైపు మరింత మొగ్గు చూపవచ్చు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్, ముడి చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం, సగానికి పైగా ఎల్‌పీజీని హోర్ముజ్ జలసంధి నుంచే అందుకుంటోంది.
ఇజ్రాయెల్, అమెరికా సైనిక చర్యల తర్వాత ఇరాన్ హెచ్చరికల కారణంగా ఈ మార్గం ఇప్పుడు ముప్పును ఎదుర్కొంటోంది. ఈ మారం ప్రపంచంలోని చమురులో ఐదవ వంతు, ఖతార్ ఎల్ఎన్‌జీ ఎక్కువగా సరఫరా అయ్యే ఈ మార్గాన్ని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటివరకు సరఫరాపై ఎలాంటి ప్రభావం లేనప్పటికీ, రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యం నుంచి ముడి చమురు రవాణా తగ్గుతుందనే అంచనాలున్నాయి.






