Solar Energy: సోలార్ విద్యుత్‌లో అమెరికాను అధిగమించిన భారత్

by S Gopi |

ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకుంటున్న దేశాల్లో చైనా (315 గిగావాట్లు) తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది.

Solar Energy: సోలార్ విద్యుత్‌లో అమెరికాను అధిగమించిన భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ రంగంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఇరేనా) నివేదిక ప్రకారం.. 2025లో భారత్ కొత్తగా 37 గిగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా, 34 గిగావాట్ల సౌర విద్యుత్‌ను అదనంగా సాధించిన అమెరికాను కూడా వెనక్కి నెట్టింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకుంటున్న దేశాల్లో చైనా (315 గిగావాట్లు) తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు, 2024లో భారత్.. జపాన్ దేశాన్ని దాటి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి దేశంగా అవతరించింది. కేంద్ర ప్రభుత్వ పాలసీలు, పెరుగుతున్న పెట్టుబడుల వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

దేశీయంగా సోలార్ విద్యుత్ విస్తరణ గత కొన్నేళ్ల నుంచి వేగంగా వృద్ధి సాధిస్తోంది. 2022 నాటికి దేశంలో మొత్తం సోలార్ విద్యుత్ సామర్థ్యం 50 గిగావాట్లు ఉంటే.. ఆ తర్వాత మరో 50 గిగావాట్లు పెరగడానికి కేవలం మూడేళ్లు పట్టింది. కానీ, 2025, జనవరి నుంచి 2026, మార్చి మధ్య కేవలం 14 నెలల్లోనే భారత్ మరో 50 గిగావాట్లను అదనంగా సాధించి, మొత్తం సామర్థ్యాన్ని 154 గిగావాట్లకు పెంచుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెట్టుకున్న 34 గిగావాట్ల టార్గెట్ కంటే అత్యధికంగా 44.61 గిగావాట్ల విద్యుత్‌ను సాధించి రికార్డు సృష్టించింది. బొగ్గు, గ్యాస్ వంటివి కాకుండా పర్యావరణానికి మేలు చేసే వనరుల (శిలాజేతర) ద్వారా మనదేశంలో ప్రస్తుతం మొత్తం 288 గిగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే, అందులో సింహభాగం సోలార్ పవర్‌దే.

Next Story