India-Oman: అమల్లోకి భారత్–ఒమన్ డీల్

by S Gopi |

ముఖ్యంగా ఒమన్ తన టారిఫ్ లైన్లలో 98.08 శాతానికి జీరో డ్యూటీ యాక్సెస్ కల్పించడంతో, భారత్ నుంచి ఒమన్‌కు వెళ్లే 99.38 శాతం ఎగుమతులు సుంకం రహితంగా మారనున్నాయి.

India-Oman: అమల్లోకి భారత్–ఒమన్ డీల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌-ఒమన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడం చర్చనీయాంశమైంది. భారత్–ఒమన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో భారత ఎగుమతిదారులకు ఒమన్ మార్కెట్లో గణనీయమైన ప్రయోజనాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఒమన్ తన టారిఫ్ లైన్లలో 98.08 శాతానికి జీరో డ్యూటీ యాక్సెస్ కల్పించడంతో, భారత్ నుంచి ఒమన్‌కు వెళ్లే 99.38 శాతం ఎగుమతులు సుంకం రహితంగా మారనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఒమన్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి.

మన ఉత్పత్తులకు 'జీరో డ్యూటీ'

ఈ ఒప్పందం ద్వారా టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, లెదర్ ఉత్పత్తులు, పాదరక్షలు, క్రీడా వస్తువులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఫర్నిచర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, ఆటోమొబైల్స్ వంటి దేశంలోని కీలక కార్మిక ఆధారిత పరిశ్రమలకు భారీ ఊతం లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇది సహాయపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా ఒమన్ నుంచి వచ్చే 94.81 శాతం దిగుమతులకు సుంకం రాయితీలు ప్రకటించింది. అయితే దేశీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డైరీ, టీ, కాఫీ, రబ్బరు, పొగాకు, బంగారం, వెండి, కొన్ని పాదరక్షలు, ఇతర ఉత్పత్తులను ఈ రాయితీల పరిధి నుంచి మినహాయించింది.

సేవల రంగం.. బిలియన్ డాలర్ల మార్కెట్

వస్తువుల వాణిజ్యంతో పాటు సేవల రంగానికి కూడా సీఈపీఏ కీలక అవకాశాలను తెరుస్తోంది. ప్రస్తుతం ఒమన్ ప్రతి సంవత్సరం సుమారు 12.5 బిలియన్ డాలర్ల విలువైన సేవలను దిగుమతి చేసుకుంటోంది. అయితే అందులో భారత సేవల వాటా కేవలం 5.31 శాతం మాత్రమే ఉంది. కొత్త ఒప్పందంతో కంప్యూటర్ సేవలు, వ్యాపార, వృత్తిపరమైన సేవలు, ఆడియో-విజువల్, ఆర్అండ్‌డీ, విద్య, ఆరోగ్య సేవలు వంటి అనేక రంగాల్లో భారత కంపెనీలు, ప్రొఫెషనల్స్‌కు అవకాశాలు లభించనున్నాయి.

ఈ ఒప్పందంలోని మరో ముఖ్యమైన విషయం, మనదేశ ప్రొఫెషనల్స్‌కు ఒమన్‌లో మెరుగైన ఉద్యోగ, నివాస అవకాశాలు కల్పించడం. సంస్థల అంతర్గత బదిలీల (ఇంట్రా-కార్పొరేట్ ట్రాన్స్‌ఫర్స్) కోటాను 20 శాతం నుంచి 50 శాతానికి పెంచగా, కాంట్రాక్ట్ ఆధారిత సేవలందించే ప్రొఫెషనల్స్ ఒమన్‌లో ఉండే గడువును 90 రోజుల నుంచి రెండు సంవత్సరాలకు పొడిగించారు. అకౌంటెన్సీ, పన్నులు, ఆర్కిటెక్చర్, వైద్య సేవలు వంటి రంగాల్లో పనిచేసే భారతీయులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. యూకే, న్యూజిలాండ్‌తో ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాల తర్వాత, ప్రపంచ వాణిజ్యాన్ని విస్తరించే భారత్ వ్యూహంలో ఒమన్ సీఈపీఏ మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

Next Story