India-US: అమెరికా వ్యవసాయ దిగుమతులపై భారత్ సుంకం తగ్గింపు ఆఫర్

by S Gopi |

యూఎస్ వ్యవసాయ ఉత్పత్తులు బాదం, క్రాన్‌బెర్రీస్ వంటి దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు సానుకూలంగా..

India-US: అమెరికా వ్యవసాయ దిగుమతులపై భారత్ సుంకం తగ్గింపు ఆఫర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల అమలు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అమెరికాకు మరింత రాయితీని భారత ప్రభుత్వం ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా యూఎస్ వ్యవసాయ ఉత్పత్తులు బాదం, క్రాన్‌బెర్రీస్ వంటి దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు సానుకూలంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో భారత ప్రతినిధులతో అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బోర్బన్ విస్కీతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు బాదం, వాల్‌నట్, క్రాన్‌బెర్రీస్, పిస్తా, కాయ ధాన్యాలపై సుంకాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుందని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రకటనలో తెలిపారు. సాధ్యమైనంత వరకు ఒప్పందం అనుకూలంగా ఉండేలా చేసేందుకు భారత ప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వం అమెరికాకు వ్యవసాయ పరిశ్రమతో పాటు మరికొన్ని ముఖ్యమైన రంగాల్లో సుంకాలను సర్దుబాటు చేసిందని వారు అభిప్రాయపడ్డారు. అయితే, పాల ఉత్పత్తులు, బియ్యం, గోధుమలు, మొక్కజొన్నలపై సుంకాలు తగ్గించేందుకు భారత్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో బియ్యంతో పాటు దానిమ్మ, ద్రాక్ష వంటి పండ్ల రవాణా కోసం అమెరికా మార్కెట్‌కు యాక్సెస్‌ను కోరుతోంది. కాగా, 2024లో అమెరికా నుంచి భారత్‌కు 2 బిలియన్ డాలర్ల(రూ. 17.09 వేల కోట్ల) వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. ఇందులో 452 మిలియన్ డాలర్ల(రూ. 3,863 కోట్ల) విలువైన ఆల్కహాల్, 1.3 బిలియన్ డాలర్ల(రూ. 11.11 వేల కోట్ల పండ్లు, కూరగాయలు ఉన్నాయి. అయితే అమెరికాకు భారత్ ఎగుమతుల విలువ 5.5 బిలియన్ డాలర్లు(రూ. 47 వేల కోట్లు)గా ఉన్నాయి.

Next Story