Toll Plaza: ఇప్పట్లో శాటిలైట్ టోల్ వ్యవస్థ అమలు లేదని స్పష్టం చేసిన కేంద్రం

by S Gopi |

ఇప్పట్లో శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థను ప్రారంభించాలనే ఆలోచన లేదని పేర్కొంది.

Toll Plaza: ఇప్పట్లో శాటిలైట్ టోల్ వ్యవస్థ అమలు లేదని స్పష్టం చేసిన కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన వారం రోజులుగా కేంద్రం జాతీయ రహదారులపై త్వరలో శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్ని అమలు చేస్తుందనే కథనాలు పెరిగాయి. అయితే, దీనిపై శుక్రవారం ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మే 1 నుంచి శాటిలైట్ ఆధారిత టోల్ విధానం ప్రారంభమవుతుందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇప్పట్లో శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థను ప్రారంభించాలనే ఆలోచన లేదని పేర్కొంది. అయితే, కొన్ని ఎంపిక చేసిన టోల ప్లాజాల వద్ద ఫాస్టాగ్ సిస్టమ్ స్థానంలో కొత్త ఏఎన్‌పీఆర్-ఫాస్టాగ్ ఆధారిత విధానాన్ని తీసుకొచ్చే చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త వ్యవస్థ అమలుకు సంబంధించి ఎలాంటి టైమ్‌లైన్ ఇంకా నిర్ణయించలేదని వెల్లడించింది. ప్రభుత్వ వివరణ ప్రకారం, టోల్ ప్లాజాల్ వద్ద సమయంతో పాటు రద్దీ తగ్గించడం కోసం కొత్త టోల్ ఫీజు వసూలు విధానాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద ఫీజు వసూలుకు బదులుగా భవిష్యత్తులో రెండు టెక్నాలజీల ఆధారంగా ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్‌పీఆర్), ఫాస్టాగ్ విధానాన్ని ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద అమరుస్తారు. ఈ విధానంలో ఏఎన్‌పీఆర్ అంటే కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్‌లను గుర్తించి ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలు చేస్తాయి. ఈ విధానంలో వాహనాలు ప్లాజాల వద్ద ఆగే పని ఉండదు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-నోటీసులు ఇస్తారు. పెనాల్టీ, ఫాస్టాగ్ రద్దు వంటి చర్యలు తీసుకుంటారు. దీని అమలుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Next Story