- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India-New Zealand: భారత్–న్యూజిలాండ్ ట్రేడ్ డీల్ ఖరారు
ఈ ఎఫ్‌టీఏతో న్యూజిలాండ్‌కు ఎగుమతి అయ్యే 100 శాతం భారతీయ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచమంతా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న వేళ భారత్, న్యూజిలాండ్ మధ్య సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ఒప్పందం ఖరారైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూస్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్ మెక్‌క్లే ఎఫ్‌టీఏపై సంతకాలు చేశారు. ఈ ఏడాది చివరి నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుంది. ప్రధానంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎఫ్‌టీఏతో న్యూజిలాండ్‌కు ఎగుమతి అయ్యే 100 శాతం భారతీయ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. దీనివల్ల టెక్స్‌టైల్స్, ఫ్యాషన్ దుస్తులు, లెదర్, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇంజనీరింగ్ గూడ్స్ న్యూజిలాండ్‌లో చౌకగా మారుతాయి. తద్వారా ఇతర దేశాల ఉత్పత్తులతో పోలిస్తే మన ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడవుతాయి. ఇది మనదేశ చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ)కు, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుంది.
గతంలో ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, కార్పెట్లు, సెరామిక్స్ సహా కీలక భారతీయ ఎగుమతులపై న్యూజిలాండ్ గరిష్ఠంగా 10 శాతం టారిఫ్ విధించేది. ఎఫ్‌టీఏ ద్వారా ఇవి ఎలాంటి సుంకం లేకుండా ఆ దేశంలోకి ప్రవేశిస్తాయి.
భారత్‌కు చౌకగా వచ్చేవి
ఈ ఒప్పందం ప్రకారం భారత్ 70.03 శాతం ఉత్పత్తులపై టారిఫ్ తగ్గించింది. కొన్నిటిపై తొలగించింది. ఇవి మొత్తం ట్రేడ్‌లో 95 శాతం విలువ కలిగిన వస్తువులు. అంటే ఎక్కువగా వ్యాపారం జరిగే వస్తువులపై టారిఫ్ తగ్గించారు. తయారీ రంగానికి కావాల్సిన ఉడెన్ లాగ్స్, స్క్రాప్(లోహ వ్యర్థాలు), కోకింగ్ కోల్‌లపై కూడా టారిఫ్ లేకుండా దిగుమతికి అనుమతించింది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం తగ్గి, మన పరిశ్రమలకు కలిసొస్తుంది.
మరోవైపు, 29.97 శాతం భారతీయ ఉత్పత్తులపై భారత ప్రభుత్వం టాక్స్ తగ్గించలేదు. వ్యవసాయం, డైరీ, చిన్న పరిశ్రమల వంటి సున్నితమైన రంగాల్లో పన్నులు అలాగే ఉంచింది. పాల ఉత్పత్తులు (పాలు, క్రీమ్, పెరుగు, చీజ్ వంటివి), జంతు ఉత్పత్తులు (గొర్రె మాంసం మినహా), వ్యవసాయ ఉత్పత్తులు (ఉల్లిపాయలు, శెనగలు, బఠానీలు, మొక్కజొన్న, బాదం), చక్కెర, కృత్రిమ తేనె, జంతు, వృక్ష సంబంధిత కొవ్వులు, నూనెలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రత్నాలు, ఆభరణాలు, రాగి, దాని అనుబంధ వస్తువులు (కాథోడ్, కార్ట్రిడ్జ్లు, రాడ్లు, బార్లు, కాయిల్స్), అల్యూమినియం, దాని అనుబంధ వస్తువులు (ఇంగాట్స్, బిల్లెట్లు, వైర్ బార్లు) ఉన్నాయి.
న్యూజిలాండ్‌కు లభించే ప్రయోజనాలు
ఈ డీల్ ద్వారా న్యూజిలాండ్‌కు చెందిన 30 శాతం ఉత్పత్తులపై భారత్ సుంకాలను రద్దు చేసింది. అందులో కలప, ఉన్ని, గొర్రె మాంసం, లెదర్, రా హైడ్స్ ఉన్నాయి. 35.60 శాతం ఉత్పత్తులపై 3 నుంచి 10 ఏళ్లలో దశలవారీగా టారిఫ్ తగ్గించనున్నారు. ఇందులో పెట్రోలియం ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్‌తో పాటు కొన్ని ఎంపిక చేసిన ఎలక్ట్రిక్, మెకానికల్ యంత్రాలు, పెప్టోన్లు ఉన్నాయి. టారిఫ్ తగ్గింపు వల్ల కొన్ని ఇండస్ట్రియల్, వినియోగ ఉత్పత్తులు కూడా లాభపడతాయి.
టారిఫ్ కోటా
మనుక తేనె, యాపిల్స్, కివీ పళ్లు, మిల్క్ అల్బుమిన్ వంటి చాలాకొద్దిపాటి వస్తువులు టారిఫ్ రేట్ కోటా అంటే పరిమితి మేర తక్కువ పన్నుతో అనుమతించనున్నారు. అది దాటితే ఎక్కువ టాక్స్ తప్పదు.
న్యూజిలాండ్ భారీ పెట్టుబడి
ప్రధానంగా ఈ ఎఫ్‌టీఏ వల్ల మనదేశంలో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 1.88 లక్షల కోట్ల) మేర పెట్టుబడి పెట్టనుంది. రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ ఈ పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడుల పెట్టడంలో లోపాలు ఉంటే, వాటి పరిష్కారానికి వీలుగా ఒప్పందంలో 'రీబ్యాలెన్సింగ్ క్లాజ్'ను కూడా చేర్చడం గమనార్హం.
ఆర్థిక సంబంధాలకు బలమైన పునాది
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో వస్తువుల వాణిజ్యంతో పాటు సేవల రంగానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఐటీ, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, విద్య వంటి రంగాల్లో పనిచేసే భారతీయ నిపుణులకు న్యూజిలాండ్‌లో ఉద్యోగ అవకాశాలు మరింత సులభంగా లభించే అవకాశం ఉంది. తాత్కాలిక వర్క్ వీసాలు, ప్రొఫెషనల్ మొబిలిటీ వంటి అంశాల్లో సౌలభ్యం పెరగడం వల్ల రెండు దేశాల మధ్య మానవ వనరుల మార్పిడి వేగవంతమవుతుంది. దీనివల్ల కేవలం వ్యాపార సంబంధాలే కాకుండా ప్రజల మధ్య సంబంధాలు కూడా బలపడతాయి. ఫలితంగా భారత్–న్యూజిలాండ్ ఆర్థిక భాగస్వామ్యానికి దీర్ఘకాలిక బలమైన పునాది ఏర్పడుతుంది.






