India: 2030 నాటికి ఉన్నత-మధ్య ఆదాయ దేశంగా భారత్: ఎస్‌బీఐ రీసెర్చ్

by S Gopi |

తక్కువ ఆదాయ వర్గం నుంచి బయటపడటానికి సుమారు 60 సంవత్సరాలు పట్టిన తర్వాత, భారత్ 2007లో దిగువ-మధ్య ఆదాయ దేశంగా అవతరించింది.

India: 2030 నాటికి ఉన్నత-మధ్య ఆదాయ దేశంగా భారత్: ఎస్‌బీఐ రీసెర్చ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2030 నాటికి భారత్ ప్రపంచ బ్యాంకు ఉన్నత-మధ్య ఆదాయ విభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో వెల్లడించింది. రాబోయే నాలుగేళ్లలో దేశ తలసరి ఆదాయం 4,000 డాలర్ల(మన కరెన్సీలో రూ. 3,63,516)కు చేరుకుంటుందని అంచనా వేసింది. ఈ అంచనా తలసరి స్థూల జాతీయ ఆదాయం, గత రెండు దశాబ్దాలుగా భారత వృద్ధిపై ఆధారపడి ఉంది. తక్కువ ఆదాయ వర్గం నుంచి బయటపడటానికి సుమారు 60 సంవత్సరాలు పట్టిన తర్వాత, భారత్ 2007లో దిగువ-మధ్య ఆదాయ దేశంగా అవతరించింది. 2030 నాటికి తలసరి ఆదాయం రూ. 3.64 లక్షలకు చేరుకోవచ్చని, తద్వారా చైనా, ఇండోనేషియా వంటి దేశాల సరసన ఉన్నత-మధ్య ఆదాయ వర్గంలోకి చేరుకుంటుందని నివేదిక తెలిపింది. ఉన్నత-మధ్య ఆదాయ వర్గంలోకి చేరడానికి భారత్‌కు మరో 4 ఏళ్ల సమయం పట్టినప్పటికీ, 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మార్కును చేరుకుంటుందని నివేదిక అభిప్రాయపడింది.

అధిక ఆదాయ దేశంగా ఎప్పుడు?

భవిష్యత్తుకు సంబంధించి, 2047 నాటికి భారత్ అధిక ఆదాయ హోదాను చేరుకునే సామర్థ్యం తలసరి ఆదాయ వృద్ధి వేగంపై ఆధారపడి ఉంటుందని నివేదిక తెలిపింది. అధిక ఆదాయ దేశానికి ప్రస్తుత తలసరి ఆదాయ పరిమితి 13,936 డాలర్లుగా ఉంది. 2047 నాటికి చేరుకోవాలని పరిగణనలోకి తీసుకుంటే, భారత తలసరి ఆదాయం 7.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరగాలి. 2001 నుంచి 2024 మధ్య దేశ తలసరి ఆదాయం 8.3 శాతం వార్షిక రేటుతో పెరిగినందున, భవిష్యత్తు లక్ష్యాలను కూడా భారత్ సులభంగా చేరుకోగలదని నివేదిక వివరించింది.

Next Story