- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget-2025: కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి: దేశీయ కంపెనీలు
72 శాతానికి పైగా నిపుణులు ఈసారి బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనకు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు

దిశ, బిజినెస్ బ్యూరో: మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను వెలువరించనుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే వివిధ రంగాల నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ వినతులు అందగా, తాజాగా కేర్ఎడ్జ్ రేటింగ్ నిర్వహించిన ఓ సర్వేలో పలు రంగాలకు చెందిన నిపుణులు బడ్జెట్ ప్రాధాన్యతలను సూచించారు. ఇందులో 72 శాతానికి పైగా నిపుణులు ఈసారి బడ్జెట్‌లో ఉద్యోగాల కల్పనకు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా సేవలు, తయారీ రంగాలకు చెందినవారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవ్యవస్థకు కీలకమైన ఉపాధి కల్పన, అధిక ఆహార ద్రవ్యోల్బణం అనే అంశాలు ప్రధాన సవాళ్లుగా ఉండనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని 45-60 శాతం మంది బడ్జెట్ ప్రాధాన్యతలుగా చూడాలన్నారు. వీటి తర్వాత వినియోగం పెంచే చర్యలను 63 శాతం మంది, మూలధన కేటాయింపులు ఉండాలని 62 శాతం ఆశిస్తున్నారు. ఇక, ఎగుమతి ఆధారిత రంగాలకు, ఆర్థిక వృద్ధికి మద్దతివ్వాలని 25 శాతం మంది నిపుణులు కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థకు దేశీయ వినియోగం, భౌగోళిక రాజకీయ పరిణామాలు, డిమాండ్ ముఖ్యమైన సమస్యలుగా ఉండనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వృద్ధిపై ఆందోళనలు ఉన్నప్పటికీ ద్వితీయార్థం సమయానికి ఆశాజనకంగా ఉంటుందని సగం మంది అభిప్రాయపడ్డారు. 2025-26లో దేశ వాస్తవ జీడీపీ 6-6.5 శాతం మధ్య ఉంటుందని అంచనా.






