Swiggy: మూడు రెట్లు పెరిగిన ‘ఫుడ్ ఆన్ ట్రైన్’ ఆర్డర్లు

by S Gopi |

మరోవైపు, ఒకే పీఎన్ఆర్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ స్టేషన్లలో భోజనం ఆర్డర్ చేసే మల్టీ-స్టేషన్ బుకింగ్‌లు ఏడాదిలో 300 శాతం పెరిగాయి.

Swiggy: మూడు రెట్లు పెరిగిన ‘ఫుడ్ ఆన్ ట్రైన్’ ఆర్డర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీకి చెందిన ‘ఫుడ్ ఆన్ ట్రైన్’ సేవలు కంపెనీకి కొత్త వృద్ధి ఇంజిన్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ సేవలను 180కి పైగా నగరాలకు విస్తరించిన స్విగ్గీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతేడాదితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఆర్డర్లను నమోదు చేసింది. ముఖ్యంగా మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, అభివృద్ధి చెందుతున్న నగరాల నుంచి భారీ గిరాకీ ఉందని కంపెనీ వెల్లడించింది. కొన్ని పట్టణాల్లో వచ్చిన ఆర్డర్లలో 66 శాతం మంది స్విగ్గీని తొలిసారి ఉపయోగించిన కస్టమర్లే కావడం ఆశ్చర్యం కలిగించిందని కంపెనీ అభిప్రాయపడింది. మరోవైపు, ఒకే పీఎన్ఆర్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ స్టేషన్లలో భోజనం ఆర్డర్ చేసే మల్టీ-స్టేషన్ బుకింగ్‌లు ఏడాదిలో 300 శాతం పెరిగాయి. అలాంటి ప్రయాణికులు సాధారణ కస్టమర్లతో పోలిస్తే 2.2 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని కంపెనీ తెలిపింది. ఈ వేసవిలో గురుగ్రామ్, ఉదయ్‌పూర్, బికనీర్, నిజామాబాద్, తాడిపత్రి సహా మరో 17 స్టేషన్లకు సేవలను విస్తరించడంతో పాటు, టికెట్ స్కాన్ చేస్తే పీఎన్ఆర్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించి ఆర్డర్ చేసే కొత్త ఫీచర్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధానంగా ఈ సేవల వృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాలేజీలు రీ-ఓపెన్ అయిన మే చివరి వారంలో విద్యార్థుల ఆర్డర్లు 70 శాతం పెరిగాయని కంపెనీ తెలిపింది. ఇష్టమైన ఆహారాల్లో రోటీ మొదటి స్థానంలో నిలవగా, చికెన్ బిర్యానీ, మసాలా దోస, ఆలూ పరాఠా, ఆలూ టిక్కీ బర్గర్ కూడా ఎక్కువ ఆదరణ పొందాయి.

Next Story