Crude Oil: రోజుకు 2 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి

by S Gopi |

గత నెలలో రష్యా నుంచి వచ్చిన చమురు రోజుకు 16 లక్షల బ్యారెళ్లు మాత్రమే

Crude Oil: రోజుకు 2 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి
X

దిశ, బిజినెస్ బ్యూరో: రష్యా చమురు కొంటున్నందుకు అమెరికా అధిక సుంకాలు విధించినప్పటికీ భారత్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ ఆగష్టులో ప్రతి రోజూ 20 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు కొనుగోలు చేస్తున్నట్టు గ్లోబల్ రియల్ టైమ్ డేటా ప్రొవైడర్ కెప్లర్ తెలిపింది. దేశీయ చమురు శుద్ధి సంస్థలు ఆర్థికపరమైన ప్రయోజనాల ఆధారంగానే ఈ కొనుగోళ్లను కొనసాగిస్తున్నాయి. కెప్లర్ ప్రకారం, భారత్ ప్రతిరోజూ 52 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేస్తుంది. ఇందులో 38 శాతం వాటా రష్యాదే. గత నెలలో రష్యా నుంచి వచ్చిన చమురు రోజుకు 16 లక్షల బ్యారెళ్లు మాత్రమే. సౌదీ, ఇరాక్ దేశాల నుంచి కొనే చమురును తగ్గించుకున్న కారణంగా రష్యా నుంచి దిగుమతులు పెరిగాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి ప్రతిరోజూ 2.64 లక్షల బ్యారెళ్ల చమురును మన దేశం కొనుగోలు చేసింది. గత నెలాఖరులో అమెరికా రష్యా చమురు కొంటున్నందుకు భారత్‌పై అధిక టారిఫ్, పెనాల్టీ విధించింది. అయినప్పటికీ రష్యా నుంచి దిగుమతులు స్థిరంగానే కొనసాగుతున్నాయి. అయితే, ఈ డేటా జూన్, జూలై ప్రారంభం నాటికి కావడంతో ఇప్పుడు కొత్తగా వచ్చే డేటాలో రష్యా చమురు కొనుగోలు తగ్గి ఉండొచ్చని కెప్లర్ అనలిస్ట్ సుమిత్ పేర్కొన్నారు. అమెరికా విధించిన సుంకాల ప్రభావం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కనిపించవచ్చు. అయితే, రష్యా చమురు దిగుమతులను తగ్గించుకోవాలని ఆలోచనలో భారత్ లేదని తెలుస్తోంది. తాజాగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) ఛైర్మన్ అర్వీందర్ సింగ్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు.

Next Story