- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India-UK: చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్-యూకే సంతకాలు
తద్వారా ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింతగా బలపడనున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, యూకే మధ్య దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇటీవలే ఖరారైంది. గురువారం ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి(ఎఫ్‌టీఏ) సంబంధించి లండన్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో.. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, బ్రిటన్ ట్రేడ్ మినిస్టర్ జోనథన్ రెనాల్డ్స్ సంతకాలు చేశారు. భారత ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనివల్ల ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 34 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో దాదాపు రూ. 3 లక్షల కోట్లు) జరగనుంది. తద్వారా ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింతగా బలపడనున్నాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్య విలువ 120 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు లక్ష్యాన్ని నిర్దేశించాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఒప్పందం జరిగిన విషయాన్ని ప్రకటించారు. అయితే, గురువారం సమగ్రమైన ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈపీఏ)గా పరిగణించే తుది ఒప్పందంపై సంతకాలు జరిగాయి. తద్వారా ఈ ఒప్పందానికి చట్టపరమైన సమీక్ష పూర్తయినట్టే.
ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత్-బ్రిటన్ భాగస్వామ్యంలో విజన్-2035 లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. రెండు దేశాల భాగస్వామ్యం ఒక కొత్త అధ్యాయం అవుతుంది. రక్షణ, భద్రత, ఏఐ, విద్య తదితర రంగాల్లో అనేక అవకాశాలు లభిస్తాయి. ఆరు బ్రిటన్ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నాయని పేర్కొన్నారు.
మన ఎగుమతులపై నో ట్యాక్స్
ఈ డీల్ కారణంగా భారత్ నుంచి యూకేకు వెళ్లే దాదాపు 99 శాతం ఎగుమతులపై సుంకాలను తొలగించడం లేదా తగ్గించనున్నారు. ఫలితంగా భారత్‌కు ఎక్కువ ప్రయోజనాలు లభించనున్నాయి. ముఖ్యంగా జనరిక్ మందులు, వైద్య పరికరాలు, టెక్స్‌టైల్స్, లెదర్, పాదరక్షలు, క్రీడా వస్తువులు, బొమ్మలు, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఆటో పరికరాలు, యంత్రాలు, సేంద్రీయ రసాయనాలు వంటి రంగాలకు కలిసి రానుంది.
భారతీయ రైతులకు లాభదాయకం
భారత్-యూకే ఒప్పందంతో భారతీయ రైతులకు పలు రకాల లాభాలివ్వనుంది. బ్రిటన్ మార్కెట్‌లో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు పండ్లు, కూరగాయలు, మసాలాలు, ధాన్యాల ఎగుమతులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. యూకే ప్రజల్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ కారణంగా, వాటిని పండించే మన రైతులకు మెరుగైన ధర లభించనుంది. అంతేకాకుండా, ఎగుమతులపై సుంకాలు తగ్గడం వల్ల మధ్యవర్తులపై ఆధారపడే పనిలేకుండా రైతులకు నేరుగా లాభం చేకూరుతుంది. మొత్తంగా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పంటలకు గుర్తింపు, గ్లోబల్ మార్కెట్‌లో మనరైతుల ఉత్పత్తులు విలువను పెరుగుతుంది. టెక్స్‌టైల్స్, లెదర్‌పై సున్నా సుంకాలు బంగ్లాదేశ్, కంబోడియా వంటి దేశాలతో భారత్ పోటీ పడేందుకు వీలవుతుంది.
ఉద్యోగాలు, పెట్టుబడులు
ఈ ఒప్పందంతో దిగుమతులు-ఎగుమతులపై సుంకాలు తగ్గడంతో పెట్టుబడులు పెరుగుతాయి. ఫలితంగా ఉద్యోగావకాశాలు ఊపందుకుంటాయి. అలాగే, ఐటీ, ఐటీ సంబంధిత పరిశ్రమలు, ఇంజనీరింగ్, విద్యా సహా పలు రకాల సేవలపై సుంకాలు తగ్గనున్నాయి. దీనర్థం.. యూకే వెళ్లే మన ఉద్యోగులకు ప్రయోజనాలు లభిస్తాయి.
అదేవిధంగా, 2030 నాటికి ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఎగుమతులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందనే అంచనాలు కనిపిస్తున్నాయి. రసాయనాల ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30-40 శాతం పెరగవచ్చు. రత్నాభరణాల ఎగుమతులు రాబోయే మూడేళ్లలో రెట్టింపు అవుతాయని అంచనా. ప్రస్తుత వీటి ఎగుమతుల విలువ 941 మిలియన్ డాలర్లుగా ఉంది.
యూకేకు దక్కే ప్రయోజనాలు
ఈ ఒప్పందం బలహీనంగా ఉన్న బ్రిటీష్ ఎకానమీకి బూస్టప్ కానుంది. యూకే ప్రధాని స్టార్మర్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఊతమివ్వనుంది. అంతేకాకుండా ఐదేళ్ల క్రితం బ్రెక్సిట్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదే. భారత్‌కు కూడా ఇది ఇప్పటివరకు సంతకం చేసిన అత్యంత ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం. ఫలితంగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్న అడ్డంకులను తగ్గించడానికి భారత్‌కు సరైన అవకాశం.
ఇదే సమయంలో యూరోపియన్ యూనియన్, యూఎస్ వంటి ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలు ప్రపంచంలోని అత్యంత జనాభా కలిగిన భారత్‌ను సుంకాల బెదిరింపుల ద్వారా అధిక మార్కెట్ యాక్సెస్ కోసం ఒత్తిడి చేస్తున్న సమయంలో ఈ ఒప్పందం కలిసి రానుంది.
ఒప్పందంలో భాగంగా, భారత్ సుంకాలను 90 శాతం మేర తగ్గిస్తుంది, యూకే ఉత్పత్తులపై సగటు సుంకం 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గితుంది. తక్షణం జిన్, స్కాచ్ విస్కీపై సుంకాన్ని సగానికి తగ్గించి 75 శాతానికి తగ్గిస్తుంది. వచ్చే పదేళ్ల కాలంలో ఈ సుంకాలు 40 శాతానికి తగ్గుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై కోటా ఆధారిత సుంకాల తగ్గింపు ద్వారా ఆటోమోటివ్ సుంకాలను కూడా 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గించనున్నారు.






