ఏటా 16 శాతం పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగం!

by Disha Web |
ఏటా 16 శాతం పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగం!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు కోలుకోవడంతో వినియోగం పెరుగుతోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా క్రెడిట్ కార్డు, యూపీఐ లావాదేవీలు గణనీయంగా వృద్ధి చెందడమే దీనికి కారణమని, దీనివల్ల వినియోగం కూడా పెరుగుతోందని నిపుణులు పేర్కొన్నారు. ఆర్‌బీఐ నెలవారీ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్‌లో యూపీఐ లావాదేవీలు రూ. 9.83 లక్షల కోట్ల నుంచి ఆగష్టును నాటికి రూ. 10.73 లక్షల కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్) ద్వారా క్రెడిట్ కార్డు ఖర్చులు రూ. 29,988 కోట్ల నుంచి రూ. 32,383 కోట్లకు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో క్రెడిట్ కార్డు వినియోగం విలువ రూ. 51,375 కోట్ల నుంచి రూ. 55,264 కోట్లకు చేరుకున్నాయి.

2017 నుంచి 2022 మధ్య కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం ఏడాదికి 16 శాతం చొప్పున పెరిగాయని ఎస్‌బీఐ కార్డ్స్ ఎండీ, సీఈఓ రామమోహన్ రావు అన్నారు. క్రెడిట్ కార్డుల వాడకంతో పాటు ఖర్చులు కూడా పెరిగాయి. గత కొన్ని నెలల్లోనే పరిశ్రమ నెలవారీ క్రెడిట్ కార్డులు సగటున రూ. లక్ష కోట్లను దాటుతోంది. ఇది ప్రజల వినియోగం ఏ స్థాయిలో ఉందో సూచిస్తుందని, రానున్న పండుగ సీజన్ క్రెడిట్ కార్డు వ్యయం మరింత పెరగవచ్చని ఆయన వివరించారు. డిజిటల్ లావాదేవీలు, విలువ పెరగడం ఆర్థికవ్యవస్థకు మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.


Next Story